Chennai vs Hyderabad : బోణీ కొట్టిన హైదరాబాద్‌.. చెన్నైకి తప్పని మరో ఓటమి..

టీ20 మెగా టోర్నీలో హైదరాబాద్ బోణీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే ఛేదించింది.  దీంతో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది...

Published : 09 Apr 2022 19:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో హైదరాబాద్ బోణీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే ఛేదించింది.  దీంతో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌కిది తొలి విజయం కాగా.. చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్‌ శర్మ (75 : 49 బంతుల్లో 5×4, 3×6) అర్ధ శతకంతో మెరిశాడు. కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ (32) పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠీ (39*), నికోలస్‌ పూరన్‌ (5*) జట్టుని విజయ తీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో బ్రావో, ముఖేష్ చౌదరీ చెరో వికెట్ పడగొట్టారు.


విజయం దిశగా హైదరాబాద్‌..

టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ తొలి విజయానికి  చేరువగా ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం హైదరాబాద్‌ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (73*), రాహుల్ త్రిపాఠి (19*) ఉన్నారు. అంతకుముందు మరో ఓపెనర్‌ కేన్ విలియమ్సన్‌ (32) ముకేశ్‌ చౌదరి బౌలింగ్‌లో మొయిన్‌ అలీ చేతికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. హైదరాబాద్‌ విజయానికి 24 బంతుల్లో 30 పరుగులు అవసరం.


క్రీజులో కుదురుకున్న హైదరాబాద్ ఓపెనర్లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఏడో ఓవర్లో జడేజా ఐదు పరుగులు ఇవ్వగా.. మొయిన్ అలీ వేసిన ఆ తర్వాతి ఓవర్లో కేన్ విలియమ్సన్ (24) ఓ సిక్స్‌ బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో ఆఖరు బంతిని అభిషేక్‌ శర్మ (44) బౌండరీకి తరలించాడు. పదో ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ 69/0 స్కోరుతో నిలిచింది. హైదరాబాద్‌ విజయానికి ఇంకా 86 పరుగుల దూరంలో ఉంది.


పవర్‌ ప్లే పూర్తి.. నిలకడగా హైదరాబాద్ బ్యాటింగ్‌

ఛేదనకు దిగిన హైదరాబాద్ బ్యాటర్లు వికెట్‌ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతున్నారు. ముఖేష్‌ చౌదరీ వేసిన మూడో ఓవర్లో ఆఖరు బంతిని బౌండరీకి తరలించిన అభిషేక్ శర్మ.. మహేశ్ తీక్షణ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మరో ఫోర్‌ కొట్టాడు. ఐదో ఓవర్లో జోర్డాన్‌ ఒకే పరుగు ఇచ్చాడు. ఆరో ఓవర్లో అభిషేక్‌ (27) మరో ఫోర్‌, ఓ సిక్స్‌ బాదాడు. కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (10) క్రీజులో ఉన్నాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.


ఛేదనకు దిగిన హైదరాబాద్.. క్రీజులో విలియమ్సన్‌, అభిషేక్ శర్మ

చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ బ్యాటర్లు బరిలోకి దిగారు. ముఖేష్‌ చౌదరి వేసిన తొలి ఓవర్లో ఒకే పరుగు ఇచ్చాడు. మహేశ్ తీక్షణ వేసిన రెండో ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (4) ఓ ఫోర్‌ బాదాడు. అభిషేక్‌ శర్మ (2) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ 6/0 స్కోరుతో నిలిచింది.


చెన్నై బ్యాటింగ్ పూర్తి..రాణించిన మొయిన్‌ అలీ.. హైదరాబాద్‌ లక్ష్యం ఎంతంటే.?

హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో చెన్నై బ్యాటింగ్‌ ముగిసింది. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. హైదరాబాద్‌ ముందు 155 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాటర్లలో మొయిన్‌ అలీ (48 : 35 బంతుల్లో 3×4, 2×6), అంబటి రాయుడు (27) కీలక ఇన్నింగ్సులు ఆడారు. కెప్టెన్‌ రవీంద్ర జడేజా (23), ఓపెనర్లు రాబిన్‌ ఉతప్ప (15), రుతురాజ్‌ గైక్వాడ్‌ (16) పరుగులు చేశారు. శివమ్‌ దూబె (3), ధోని (3) నిరాశ పరిచారు. బ్రావో (8), క్రిస్‌ జోర్డాన్‌ (6)  నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్‌ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, టి. నటరాజన్‌ రెండేసి, మార్కో జాన్‌సెన్‌, మార్‌క్రమ్‌, భువనేశ్వర్‌ కుమార్ తలో వికెట్‌ పడగొట్టారు.


పుంజుకుంటున్న హైదరాబాద్ బౌలర్లు..

కీలక సమయంలో హైదరాబాద్ బౌలర్లు పుంజుకుంటున్నారు. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టారు. నటరాజన్‌ వేసిన 12వ ఓవర్లో ఆరు పరుగులు ఇవ్వగా.. ఉమ్రాన్‌ మాలిక్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మొయిన్ అలీ వరుసగా  ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ బాదాడు. ఈ క్రమంలోనే వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 14వ ఓవర్లో మూడో బంతిని గాల్లోకి లేపిన అంబటి రాయుడు (27).. బౌండరీ లైన్ వద్ద మార్‌క్రమ్‌కి చిక్కి క్రీజు వీడాడు. మార్‌క్రమ్ వేసిన తర్వాతి ఓవర్లో నాలుగో బంతిని సిక్స్‌గా మలిచిన మొయిన్ అలీ (48).. ఐదో బంతికి బౌండరీ లైన్‌ వద్ద రాహుల్ త్రిపాఠికి చిక్కాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. 


దూకుడు పెంచుతున్న చెన్నై.. కట్టుదిట్టంగా హైదరాబాద్‌ బౌలింగ్‌

చెన్నై బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజ్‌లో మొయిన్‌ అలీ (23*), అంబటి రాయుడు (24*) ఉన్నారు. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా వేస్తుండటంతో రన్స్‌ చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే మార్కో జాన్‌సెన్ ఓవర్‌లో అంబటి రాయుడు వరుసగా రెండు బౌండరీలు కొట్టి కాస్త ఊపు తెచ్చాడు.


పవర్‌ ప్లే పూర్తి.. స్కోరెంతంటే.?

చెన్నై, హైదరాబాద్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగిసింది. ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజ్‌లో అంబటి రాయుడు (1*), మొయిన్‌ అలీ (9*) ఉన్నారు. అంతకుముందు హైదరాబాద్ బౌలర్ల ధాటికి చెన్నై ఓపెనర్లు రాబిన్‌ ఉతప్ప (15), రుతురాజ్‌ గైక్వాడ్ (16) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో ఉతప్ప ఔట్‌ కాగా.. రుతురాజ్‌ను నటరాజన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.


బ్యాటింగ్‌కు దిగిన చెన్నై..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ (10*), రాబిన్‌ ఉతప్ప (15*) ఉన్నారు. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నప్పటికీ చెన్నై బ్యాటర్లు పరుగులు రాబడుతూనే ఉన్నారు. భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్‌ చక్కని బంతులను వేస్తూ రన్స్‌ను నియంత్రిస్తున్నారు.


టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌..

మెగా టీ20 టోర్నీలో ఇవాళ డబుల్‌ మజా మళ్లీ వచ్చేసింది. ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. అందులో భాగంగా తొలి మ్యాచ్‌ చెన్నై, హైదరాబాద్‌ జట్ల మధ్య ముంబయి వేదికగా మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకుని చెన్నైకి బ్యాటింగ్‌ అప్పగించాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లను ఆడిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై బోణీ కొట్టలేదు. అదే విధంగా గత సంవత్సరం అనుభవాల నుంచి ఏమాత్రం నేర్చుకోని హైదరాబాద్‌ కూడా పాయింట్ల ఖాతా తెరవలేదు. ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనైనా హైదరాబాద్‌ బోణీ కొడుతుందో.. నాలుగో మ్యాచ్‌ ఆడుతున్న ఛాంపియన్‌ చెన్నై పుంజుకుని విజయాల బాటలోకి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

తుది జట్ల వివరాలు : 

హైదరాబాద్‌ : అభిషేక్ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, ఉమ్రాన్‌ మాలిక్, టి. నటరాజన్‌

చెన్నై : రాబిన్ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్‌ దూబే, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, క్రిస్‌ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్‌ చౌదరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని