
T20 World Cup:ధోనీ అందుకు డబ్బులు తీసుకోడు: జై షా
ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే చాలా జట్లు యూఏఈకి చేరుకున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కోసం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీమ్‌ఇండియాకు మెంటార్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ధోనీ కూడా ఆమోదం తెలిపాడు. అయితే, మెంటార్‌గా సేవలు అందించేందుకు ధోనీ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు.
‘టీ20 ప్రపంచకప్ కోసం టీమ్‌ఇండియాకు మెంటార్‌గా సేవలు అందించేందుకు ధోనీ ఎలాంటి గౌరవ వేతనంను తీసుకోవడం లేదు’ అని జైషా అన్నారు. కాగా, ధోనీ మెంటార్‌గా నియమితుడు కావడంలో జైషా కీలకంగా వ్యవహరించాడు. ధోనీతో చర్చించి ఈ ప్రతిపాదనను అతడు అంగీకరించే విధంగా కృషి చేశాడు. ఈ ప్రతిపాదనకు ధోనీ అంగీకరించిన విషయాన్నిటీమ్‌ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు తెలియజేశాడు. ఇదిలా ఉండగా, 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ని ధోనీ సారథ్యంలో భారత్ గెలుపొందింది. తర్వాత ఐదు టీ20 ప్రపంచకప్‌లు జరగ్గా..టీమ్‌ఇండియా ఒక్క దాంట్లో కూడా విజేతగా నిలవలేదు.
ధోనీ 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ సెమీఫైనల్స్‌లో జడేజా(77)తో కలిసి ధోనీ(50) రాణించినా భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత కొద్ది నెలలు ఆటకు విశ్రాంతి చెప్పిన మహీ తర్వాత 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే గతేడాది ఐపీఎల్‌లో ఆడినా నిరాశపర్చాడు. అయితే, ప్రస్తుత సీజన్‌లో చెన్నై ఫైనల్స్‌కి చేరింది. చూస్తుంటే ధోనీ సీఎస్‌కేకు మరో ట్రోఫీని అందించేలా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియాను కూడా టీ20 ప్రపంచకప్‌లో మెరిపించాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.