T20 World Cup: టీమ్‌ఇండియా కథ ఇంటికే.. ఆఖరి మ్యాచ్‌ నామమాత్రమే!

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రయాణం లీగ్‌దశలోనే ముగియనుంది. సూపర్‌ 12 గ్రూప్‌-2లో ఇప్పటికే పాకిస్థాన్‌ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా..

Updated : 08 Nov 2021 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రయాణం లీగ్‌దశలోనే ముగిసింది. సూపర్‌-12 గ్రూప్‌-2లో ఇప్పటికే పాకిస్థాన్‌ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. తాజాగా అఫ్గానిస్థాన్‌ మీద న్యూజిలాండ్‌ గెలిచి గ్రూప్‌లో రెండో స్థానంతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఇక సోమవారం (నవంబర్ 8న) భారత్‌-నమీబియా మధ్య జరిగే మ్యాచ్‌ నామమాత్రమే.

పాకిస్థాన్‌, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాతో కూడిన గ్రూప్‌లో భారత్‌ ఉంది. మన ఆటగాళ్ల ఫామ్‌ను చూస్తే నాకౌట్‌ దశకు టీమ్‌ఇండియా సులువుగానే చేరుకుంటుందని అందరూ భావించారు. ఎందుకంటే పాక్‌, కివీస్ మాత్రమే పెద్ద జట్లు కాగా.. మిగతా మూడింటితో ఇబ్బందేమీ లేదు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఓడిన టీమ్‌ఇండియా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచినా.. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా పాక్‌ మీద తప్ప.. మిగతా అన్నింట్లోనూ విజయం సాధించింది. ఇక పాకిస్థాన్ 10 పాయింట్లతో (ఐదుకి ఐదు విజయాలు) తొలి స్థానం సాధించి ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. కివీస్‌ (8 పాయింట్లు) ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి రెండో స్థానంతో సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఆ తర్వాత టీమ్‌ఇండియా(4 పాయింట్లు), అఫ్గాన్‌ (4 పాయింట్లు). నమీబియా (2), స్కాట్లాండ్‌ (0) ఉన్నాయి.

కివీస్‌తో ఓటమే పెద్ద దెబ్బ..

ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ కప్‌ టోర్నీల్లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఒక్క విజయం లేదు.. ఈ క్రమంలో ఈసారీ టీమ్‌ఇండియా విజయ ఢంకా మోగిస్తుందిలే అని క్రికెట్‌ అభిమానులు భావించారు. అయితే భారత్‌ను చిత్తు చేసిన పాక్‌ చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సరే.. భావోద్వేగాల మధ్య జరిగిన మ్యాచ్‌లో మనోళ్లు ఓడిపోయారులే అని అభిమానులు సర్దుకున్నారు. తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు వారం సమయం ఉంది కదా.. పుంజుకుంటారులే అనుకున్నారు.. కానీ మరోసారి భంగపాటు తప్పలేదు. అయితే కనీసం పోరాటం చేయలేక చేతులెత్తేయడమే సగటు అభిమానిని బాధ పెట్టిన అంశం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమై పరాభవం మూటగట్టుకున్నారు. తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించినా లాభం లేకుండా పోయింది. పాకిస్థాన్‌తోపాటు కివీస్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత్‌ ఇంటిముఖం పట్టక తప్పలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని