Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్‌ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ (World Cup 2023)కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌. అది కూడా సొంతగడ్డపై. కాబట్టి ఈ సిరీస్‌ను ప్రపంచకప్‌ సన్నాహకం కోసం ఉత్తమంగా ఉపయోగించుకోవాలని టీమ్‌ఇండియా (Team India) చూసింది. తొలి రెండు వన్డేల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది.

Published : 29 Sep 2023 02:06 IST

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ (World Cup 2023)కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌. అది కూడా సొంతగడ్డపై. కాబట్టి ఈ సిరీస్‌ను ప్రపంచకప్‌ సన్నాహకం కోసం ఉత్తమంగా ఉపయోగించుకోవాలని టీమ్‌ఇండియా (Team India) చూసింది. తొలి రెండు వన్డేల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా రెండో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసి ఏకంగా 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వర్షం అంతరాయం కారణంగా 99 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అప్పుడు అన్నీ కుదురుకున్నట్లే కనిపించాయి. టీమ్‌ఇండియాకు ఇక తిరుగులేదనిపించింది. కానీ మూడో వన్డేకు వచ్చేసరికి మరోసారి భారత జట్టు బలహీనంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో జట్టులోని డొల్లతనం బయటపడిందనే చెప్పాలి. ప్రపంచకప్‌కు ముందు ఈ ఓటమి జట్టుకు మేలు చేసేదే! కప్పు ముందు కనువిప్పు కలిగించేదే! ఈ ఓటమి నుంచి పాఠాలు నేరిస్తే.. అది ప్రపంచకప్‌లో భారత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఒక్క మ్యాచే అనుకుంటే..

ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలు గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ దక్కించుకున్నాం కదా.. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన ఏమవుతుందిలే అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌ కూడా ముఖ్యమే. విశ్వ విజేతగా నిలవాలంటే ప్రతి మ్యాచ్‌నూ ఎంతో కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. రాబోయే ప్రపంచకప్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరుగుతుంది. అంటే 10 జట్లు పోటీపడే టోర్నీలో.. మొదట ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఈ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. మిగతా వాటిల్లో గెలిచి ముందంజ వేయొచ్చు. ఈ దశ ముగిసే సరికి తొలి నాలుగులో ఉన్న జట్లు నేరుగా సెమీస్‌ ఆడతాయి. కానీ అక్కడి నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. ఇక్కడ ఒక్క మ్యాచ్‌ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అత్యంత తీవ్రత, ఒత్తిడి ఉండే ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఈ విషయం టీమ్‌ఇండియాకు తెలియంది కాదు. 2011 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టింది. కాబట్టి నిలకడ కొనసాగించడం ఎంతో ముఖ్యం. 

పట్టు వదలొద్దు..

ప్రపంచకప్‌ను ముద్దాడాలంటే పట్టు వదలకుండా ముందుకు సాగాలి. ఒక మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో మెప్పించి.. ఆ వెంటనే మరో పోరులో పేలవ ప్రదర్శనతో తుస్సుమనిపిస్తే ప్రయోజనం ఉండదు. ఛాంపియన్‌ ఆటతీరు ప్రదర్శిస్తేనే ఛాంపియన్‌గా నిలుస్తాం. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్‌ అదరగొట్టింది. మొదట శుభ్‌మన్‌ గిల్‌ (104), శ్రేయస్‌ అయ్యర్‌ (105) సెంచరీలు.. కేఎల్‌ రాహుల్‌ (52), సూర్యకుమార్‌ యాదవ్‌ (72*) మెరుపులతో జట్టు 399 పరుగుల భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా 33 ఓవర్లలో 317 పరుగులుగా లక్ష్యాన్ని సవరించగా.. ఛేదనలో ఆసీస్‌ను మన బౌలర్లు దెబ్బ కొట్టారు. అశ్విన్‌ (3), జడేజా (3), ప్రసిద్ధ్‌ కృష్ణ (2) వికెట్ల వేటలో సఫలమయ్యారు. కానీ మూడో వన్డేకు వచ్చేసరికి ప్రతీకారంతో ఆసీస్‌ చెలరేగిపోయింది. మొదట బ్యాటింగ్‌లో 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మన బౌలర్లు తీవ్రత కొనసాగించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఆసీస్‌ బ్యాటర్లు చెలరేగుతుంటే కట్టడి చేసేందుకు విభిన్న మార్గాలను అన్వేషించడంలో భారత్‌ విఫలమైంది. మధ్యలో బుమ్రా, కుల్‌దీప్‌ కాస్త పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. ఇక బ్యాటింగ్‌లో మంచి ఆరంభాలను రోహిత్‌ శర్మ (81), కోహ్లి (56), శ్రేయస్‌ అయ్యర్‌ (48) సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే జట్టుకు విజయాన్ని అందించే వరకు పట్టు వదలకుండా పోరాటాన్ని కొనసాగించడం ముఖ్యం. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ తీవ్రత కొనసాగించడం ప్రధానం. అలసత్వానికి అసలు చోటే ఇవ్వకూడదు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లోనూ మధ్యలో అలసిపోవడం, ఆగిపోవడం అనే మాటే ఉండకూడదు. ప్రపంచకప్‌ బరిలో దిగే మన జట్టు బలంగా ఉంది. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో సాగితే భారత్‌ మూడోసారి వన్డే విశ్వ విజేతగా నిలవడం ఖాయం. ఆ దిశగా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ సాగితే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని