T20 World Cup: ప్రపంచకప్‌లో తలపడే పాక్‌  జట్టిదే.. ఆ ఇద్దరికి షాకిచ్చారు!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి దాయాది పాకిస్థాన్‌ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది! మరో ముగ్గురుని ట్రావెల్‌ రిజర్వులుగా ప్రకటించింది....

Published : 06 Sep 2021 23:48 IST

కరాచీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి దాయాది పాకిస్థాన్‌ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది! మరో ముగ్గురుని ట్రావెల్‌ రిజర్వులుగా ప్రకటించింది. అనుభవం ఉన్న మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీనియర్‌ ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ను వదిలేసి అసిఫ్‌ అలీ, కుష్‌దిల్‌ షాను ఎంపికచేసి విస్మయపరిచింది. బాబర్‌ ఆజామ్‌ జట్టును నడిపిస్తాడు.ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌తో పాక్‌ టీ20లు ఆడనుంది. లాహోర్‌, రావల్పిండి వేదికలుగా ఏడు టీ20ల్లో తలపడనుంది. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 14 వరకు ఈ మ్యాచులు జరుగుతాయి. ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 24న దుబాయ్‌ వేదికగా భారత్‌తో పాక్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. అక్టోబర్‌ 17 నుంచి ఒమన్‌, యూఏఈలో మెగా టోర్నీ ఆరంభమయ్యే సంగతి తెలిసిందే.జట్టులోకి ఎంపికైన అసిఫ్‌ అలీ ఏప్రిల్‌లో జింబాబ్వేపై చివరి టీ20 ఆడాడు. ఇప్పటి వరకు 29 మ్యాచులాడిన అతడు 123.74 స్ట్రైక్‌రేట్‌, 16.38 సగటు నమోదు చేశాడు. మరో ఆటగాడు కుష్‌దిల్‌ 9 మ్యాచులాడి 21.6 సగటు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో లాహోర్‌లో అతడు చివరి టీ20 ఆడాడు.‘అసిఫ్‌, కుష్‌దిల్‌ గణాంకాలు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. వారి ప్రతిభను మాత్రం ఎవరూ కాదనలేరు. ఎంపికకు అందుబాటులో ఉన్న వారిలో అత్యుత్తమ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వీరే. జట్టులో ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్‌ కీపర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు, నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. ప్రపంచకప్‌ జట్టులో ఎక్కువమందికి యూఏఈలో అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. అక్కడే వరుసగా 36 మ్యాచులాడి 21 గెలిచి ప్రపంచ నంబర్‌గా ఎదిగారు’ అని చీఫ్‌ సెలక్టర్‌ మహ్మద్‌ వసీమ్‌ అన్నాడు.ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ టీ20 సిరీసులు ఆడిన అర్షద్‌ ఇక్బాల్‌, ఫహీమ్‌ అష్రఫ్‌, ఫకర్‌ జమాన్‌, సర్ఫరాజ్‌ అహ్మద్, షర్జీల్‌ ఖాన్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌ను పాక్‌ పక్కన పెట్టింది. అయితే ఫకర్‌ జమాన్‌, షానవాజ్‌ దహాని, ఉస్మాన్‌ ఖాదిర్‌ను ట్రావెల్‌ రిజర్వులుగా ఎంపిక చేయడం గమనార్హం.

పాక్‌ జట్టు: బాబర్‌ ఆజామ్‌ (కె), షాదాబ్‌ ఖాన్‌, అసిఫ్‌ అలీ, ఆజాం ఖాన్‌, హ్యారిస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ, ఇమాద్‌ వసీమ్‌, కుష్‌దిల్‌ షా, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌, షాహిన్‌ అఫ్రిది, షోయబ్‌ మఖ్సూద్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు