Ashes Series: ఇంగ్లాండ్‌కు ఘోర పరాభవం..యాషెస్‌ ఆస్ట్రేలియాదే..

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బాక్సింగ్‌ డే టెస్టుగా మొదలైన ఈ మ్యాచ్‌ను ఆసీస్‌ రెండున్నర రోజుల్లోనే పూర్తి చేసింది...

Updated : 28 Dec 2021 08:22 IST

మెల్‌బోర్న్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బాక్సింగ్‌ డే టెస్టుగా మొదలైన ఈ మ్యాచ్‌ను ఆసీస్‌ రెండున్నర రోజుల్లోనే పూర్తి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 68కే ఆలౌట్‌ చేసి.. ఇన్నింగ్స్‌ 14 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 31/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మరో 37 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ జో రూట్‌ (28), బెన్‌స్టోక్స్‌ (11) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ 6/7 సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 267 పరుగులు చేసింది.

ఈ ఉదయం రూట్‌ (12), స్టోక్స్‌ (2) పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించగా.. కాసేపటికే మిచెల్‌ స్కార్క్‌ తొలి వికెట్‌ తీశాడు. మ్యాచ్‌ ప్రారంభమైన ఐదో ఓవర్‌లోనే స్టోక్స్‌ను బౌల్డ్‌ చేశాడు. మరో ఐదు ఓవర్లకు బోలాండ్‌.. బెయిర్‌స్టో (5)ను ఎల్బీగా వెనక్కి పంపి అక్కడి నుంచి రెచ్చిపోయాడు. వరుసగా జోరూట్‌, మార్క్‌వుడ్‌ (0), ఓలీ రాబిన్సన్‌ (0)లను ఔట్‌ చేశాడు. చివరికి గ్రీన్‌.. ఆండర్సన్‌ (2)ను బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఘోర పరాభవం ఎదురైంది.

ఇది నమ్మశక్యంగా లేదు

మరోవైపు ఆడిన తొలి టెస్టులోనే ఏడు పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన ఆసీస్‌ పేసర్‌ బోలాండ్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘దీన్ని నమ్మలేకపోతున్నా. ఈరోజు మేం గెలుస్తామని తెలుసు. కానీ, ఇంత త్వరగా గెలుస్తామని మాత్రం ఊహించలేదు. ఇప్పటివరకు నేను ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఇదే అతిపెద్ద ప్రదర్శన. ఇదంత తేలికైంది కాదని తెలుసు. ఈ సందర్భంగా మాకు పూర్తి మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా’ అని బోలాండ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని