Ashwin - Morgan: అశ్విన్‌ రనౌట్‌ అయ్యుంటే మోర్గాన్‌ ఏం చేసేవాడివి?

ఇటీవల కోల్‌కతా, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘క్రీడాస్ఫూర్తి’ అనే అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ ...

Published : 02 Oct 2021 01:39 IST

కోల్‌కతా కెప్టెన్‌ను నిలదీసిన బ్రాడ్‌హాగ్‌

(Photo: Brad Hogg Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల కోల్‌కతా, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘క్రీడాస్ఫూర్తి’ అనే అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ స్పందిస్తూ ట్విటర్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ క్రీడాస్ఫూర్తిని ప్రశ్నించాడు. అసలేం జరిగిందంటే.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఫీల్డర్‌ రాహుల్‌ త్రిపాఠి విసిరిన త్రోకు.. బంతి రిషబ్‌ పంత్‌ను తాకి మరికాస్త దూరం వెళ్లింది.

అప్పుడు మరో ఎండ్‌లో ఉన్న అశ్విన్‌ రెండో పరుగు కోసం పంత్‌ను ప్రోత్సహించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇయాన్‌ మోర్గాన్‌ అశ్విన్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, అతడి చర్య సిగ్గుచేటని విమర్శించాడు. మరుసటి ఓవర్‌లో అశ్విన్‌ ఔటై పెవిలియన్‌కు వెళుతుండగా..  మోసం చేస్తే ఇలాగే జరుగుతుందని టిమ్‌సౌథీ వ్యాఖ్యానించాడు. దీంతో అశ్విన్‌, సౌథీ, మోర్గాన్‌ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అనంతరం దినేశ్‌ కార్తీక్‌ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ మోర్గాన్‌ క్రీడాస్ఫూర్తిని నిలదీశాడు. త్రిపాఠి విసిరిన త్రో బంతికి.. పంత్‌ రెండో పరుగు కోసం వెళ్లకుండా ఆగిపోయి.. అదే సమయంలో అశ్విన్‌ పరుగు కోసం ప్రయత్నించి రనౌటైతే కోల్‌కతా కెప్టెన్‌ అప్పుడు తిరిగి బ్యాటింగ్‌ చేయమని పిలిచేవాడా? అని ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌లో లేని నియమాలను తోసి పారేయాలని, నిబంధనలకు అనుగుణంగా ఆడాలని హాగ్‌ సూచించాడు. అయితే, ఎంసీసీ నిబంధనల్లో ఇలాంటి సందర్భాల్లో పరుగు తీయొచ్చని పేర్కొని ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని