
IPL 2021: ధోనీ రిటైర్ అయ్యాక అత్యుత్తమ ఫినిషర్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు: పాంటింగ్
ఇంటర్నెట్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ఫామ్‌లోకి రావడంపై దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ మాజీ సారథి మాట్లాడుతూ.. ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక గొప్ప ఆటగాడిగా గుర్తుండిపోతాడని కొనియాడాడు. చివర్లో చెన్నై సారథిని నిలువరించలేకపోయామని చెప్పాడు. తమ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు వేయలేక మూల్యం చెల్లించుకున్నారన్నాడు.
‘రుతురాజ్(70) ఔటయ్యాక జడేజా వస్తాడా, ధోనీ వస్తాడా అని డగౌట్‌లో మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అప్పుడు ధోనీ వస్తాడని అనుకొని మా ఆటగాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్ చేయమని సైగలు చేశా. చివరికి మేం అనుకున్న రీతిలో అతడిని కట్టడిచేయలేకపోయాం. ధోనీని వదిలేస్తే మూల్యం చెల్లించుకునేలా చేస్తాడని తెలుసు. అతడు చాలా ఏళ్లుగా అదే పని చేస్తున్నాడు. ఈసారి మా బౌలర్లు అతడిని కట్టడి చేయడానికి అవసరమైన ప్రదేశాల్లో బంతులు సంధించలేకపోయారు. అతడు రిటైర్ అయ్యాక క్రికెట్‌లో ఒక గొప్ప ఫినిషర్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు’ అని పాంటింగ్ కొనియాడాడు.
మరోవైపు ధోనీ ఆటచూసి దిగ్గజ ఆటగాడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ సైతం మురిసిపోయాడు. మహీ అవసరమైన వేళ బాధ్యత తీసుకొని ముందుండి నడిపించాడని మెచ్చుకున్నాడు. ‘జడేజా బాగా ఆడుతున్నా ఈసారి ధోనీనే ముందు బ్యాటింగ్‌కు వచ్చాడు. తను బాధ్యత తీసుకొని కెప్టెన్‌గా గెలిపించాలనుకున్నాడు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అవసరమైన వేళ బరిలోకి దిగి స్టైలిష్‌గా పని పూర్తి చేశాడు. ఈ ఫ్రాంఛైజీ గతేడాది మినహా ప్రతిసారీ మెరిసింది. 2020లో ఒక్కసారే దారి తప్పింది. ఇప్పుడా జట్టు ఎలా ఆడుతుందో చూడండి. అదిరిపోయే ప్రదర్శనతో తిరిగొచ్చింది. ఆటగాళ్ల భావోద్వేగాలు చూడండి. అలాగే అభిమానులు కూడా చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చేముందు టెక్నికల్ అంశాలపై చాలా విషయాలు చర్చించినట్లు చెప్పాడు. ఒక సారథిగా వెళ్లి ధోనీ మ్యాచ్‌ను పూర్తి చేస్తాడనే నమ్మకాన్ని తాను అడ్డుకోలేదని తెలిపాడు. ధోనీ ఈ మ్యాచ్‌లో అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, దాని ఫలితం చూశామన్నాడు. ఇక చివర్లో అతడు బౌండరీ బాది మ్యాచ్‌ను గెలిపించిన వెంటనే ఆటగాళ్లంతా భావోద్వేగం చెందరన్నాడు. ధోనీ బరిలోకి దిగే ప్రతిసారి బాగా ఆడాలనే తాము ఆశిస్తామని చెప్పాడు. అతడిపై భారీ అంచనాలు ఉంటాయని, ఈ క్రమంలోనే ఇప్పుడు విజయంతో ముగించాడని ఫ్లెమింగ్ ప్రశంసించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.