
IPL 2021: అతడిని చూసి భయపడ్డాం.. ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను లాగేసుకున్నారు
ఇంటర్నెట్‌డెస్క్: రుతురాజ్ గైక్వాడ్ లాంటి బ్యాట్స్‌మన్‌ను చూసి భయపడ్డామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (101*) శతకంతో చెలరేగాడు.
‘మా బ్యాటింగ్ లైనప్‌లోని ఆటగాళ్ల సామర్థ్యం మాకు తెలుసు. అందుకే ఓడినప్పుడల్లా కాస్త బాధ కలుగుతుంది. అలాంటప్పుడు మాకు మేమే ధైర్యం తెచ్చుకోవాలి. మా ఓపెనర్లు శుభారంభాలు అందిస్తున్నారు. వాళ్లు పవర్‌ప్లేలోనే ఈ మ్యాచ్‌పై పట్టు సాధించారు. జైశ్వాల్ ఈ సీజన్‌లో బాగా ఆడుతున్నాడు. ఇక శివమ్ దూబే బ్యాటింగ్ గురించి కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో చెలరేగడంతో ఈరోజు అతడిదే అనుకున్నాం. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతంగా ఆడాడు. అతడి ఆటతీరు చూసి భయపడ్డాం. అతడు వైవిధ్యమైన షాట్లు ఆడటమే కాకుండా ఆడే విధానంలో ఎలాంటి రిస్కు తీసుకోడు. అలాంటి ఆటగాడిని ఎవరైనా గౌరవించాలి. రుతురాజ్ సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉంది. ఇక ప్లేఆఫ్స్‌కు సంబంధించి మేం పెద్దగా ఆలోచించడం లేదు. ఒక్కొక్క మ్యాచ్‌పై దృష్టిసారించి ముందుకు వెళ్లాలని చూస్తున్నాం’ అని సంజూ పేర్కొన్నాడు.
6 ఓవర్లలోనే ఆట లాగేసుకున్నారు: ధోనీ
‘మేం టాస్ ఓడటం బాగాలేదు. 190 అనేది మంచి స్కోరే. అయినా తేమ ప్రభావం చూపించడంతో బంతి బ్యాట్‌పైకి దూసుకొచ్చింది. ఇలాంటి పిచ్‌పై బాగా ఆడొచ్చు. రాజస్థాన్ అదే చేసింది. మా బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. తొలి 6 ఓవర్లలోనే వాళ్ల ఓపెనర్లు మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆ జట్టు ఆడిన తీరు చూస్తే మేం 250 పరుగులు చేసుంటే బాగుండేదని అనిపించింది. వాళ్ల స్పిన్నర్లు బౌలింగ్ చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా ఉన్న పిచ్.. తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించింది. దీంతో రుతురాజ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ పరిస్థితులను అంచనా వేసి ఆడాలి. రాజస్థాన్ ఆటగాళ్లు అదే చేశారు. ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌లో ఇలాగే జరిగితే అప్పుడు ఉపయోగపడుతుంది’ అని ధోనీ వివరించాడు.
ఇన్ని రోజులూ చేయలేకపోయా: రుతురాజ్
(Photo: Ruturaj Gaikwad Instagram)
‘ఈపిచ్ మొదట నెమ్మదిగా ఉండి తర్వాత మారిపోయింది. ఆట ముందుకు వెళ్లే కొద్దీ పరిస్థితిలో మార్పు వచ్చింది. మా బ్యాట్స్‌మెన్‌లో ఎవరైనా ఒకరు 14-15 ఓవర్ల దాకా క్రీజులో ఉండాలని అనుకున్నాం. అయితే నేను చివరి వరకూ ఉండిపోయా. ఈ క్రమంలోనే ఇన్ని రోజులూ చేయలేనిది (శతకం) ఈరోజు పూర్తిచేశా. నా సాధనలో టైమింగ్‌పై ఎక్కువ దృష్టిసారిస్తా. అదే నాకు ఇన్ని రోజులుగా కలిసివస్తోంది. ఈరోజు కూడా బ్యాటింగ్‌లో టైమింగ్ మీదే మనసు లగ్నం చేశా. దాంతో బాగా ఆడా. తొలుత నెమ్మదిగా ప్రారంభించినా సెంచరీ చేస్తాననుకోలేదు. జట్టు స్కోర్‌ను 160-170కి తీసుకెళ్తే చాలనుకున్నా. నేను 2019లో తొలిసారి చెన్నై జట్టులో చేరా. కానీ, అప్పుడు ఆడే అవకాశం దక్కలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటూ చాలా విషయాలు నేర్చుకున్నా. అవన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక నేను ఈ మ్యాచ్‌లో శతకం చేయడం మంచిదే అయినా మేం గెలిచి ఉంటే ఇంకా బాగుండేది’ అని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఆటగాడు రుతురాజ్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.