
Tokyo Paralympics: ప్రాక్టీస్ లేక నిద్రపట్టేది కాదు .. పతకం సాధించలేననుకున్నా: సింగ్‌రాజ్ అధాన
(Photo: SAI Media Twitter)
టోక్యో: లాక్‌డౌన్ సమయంలో సరైన ప్రాక్టీస్ లేక నిద్రపట్టేది కాదని, దాంతో పారాలింపిక్స్‌లో పతకం సాధించలేననే తీవ్ర నిరాశకు గురయ్యానని కాంస్య పతక విజేత సింగ్‌రాజ్ అధాన గుర్తుచేసుకున్నారు. ఇటీవల కొవిడ్-19 రెండో దశ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పారాలింపిక్స్ సన్నాహకాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపాడు. దాంతో మానసిక వేదనకు కూడా లోనయ్యానన్నాడు. అదే సమయంలో తన కోచ్‌లు ఇచ్చిన సలహా మేరకు ఇంట్లోనే అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ రేంజ్ తయారుచేసుకున్నట్లు వెల్లడించాడు.
మంగళవారం జరిగిన పీ1 పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఎస్‌హెచ్-1 ఈవెంట్‌లో సింగ్‌రాజ్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘పారాలింపిక్స్‌కు ముందు సరైన ప్రాక్టీస్ లేకపోవడంతో ఇక నేను పతకం గెలవలేనేమోనని భయపడ్డా. దాంతో నిద్ర కూడా పట్టేది కాదు. అప్పుడే మా కోచ్‌ల సలహా మేరకు ఇంటి దగ్గరే షూటింగ్ రేంజ్ తయారుచేయాలనుకున్నా. కానీ, అది లక్షల ఖర్చుతో కూడుకున్నది కావడంతో మొదట ఇంట్లో వాళ్లు ధైర్యం చేయలేదు. చివరికి అందరి సహకారంతో దాన్ని పూర్తిచేశా’ అని సింగ్‌రాజ్ గుర్తుచేసుకున్నాడు.
‘ఆ సమయంలో ఏదైనా నష్టం కలిగితే కనీసం ఇంట్లో వాళ్ల భోజనానికి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోమని మా అమ్మ చెప్పింది. అలా నా కుటుంబంతో పాటు పారాలింపిక్ కమిటి, మా కోచ్‌లు సహకారం అందించారు. దాంతో ఒక్కరాత్రిలోనే లేఅవుట్ రూపొందించా. అది నిజంగా నిర్మించాలనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, అది కేవలం ఈ పారాలింపిక్స్‌కు మాత్రమే కాకుండా పారిస్ గేమ్స్ వరకూ ఉండాలని మా కోచ్‌లు చెప్పారు. అలా చాలా స్వల్ప వ్యవధిలో దాన్ని నిర్మించి ప్రాక్టీస్ చేశా. అందువల్లే ఇప్పుడిక్కడ కాంస్యంతో మీముందు నిల్చున్నా’ అని సింగ్‌రాజ్ వివరించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.