Team India: పర్లేదు..! భారత బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తారు చూస్తుండండి!

పరుగులు చేయడం ఫామ్‌ కోల్పోవడం ఆటలో భాగమేనని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నారు. ఆటగాళ్లు త్వరలోనే పరుగుల వరద పారిస్తారని ధీమా వ్యక్తం చేశారు....

Updated : 16 Aug 2021 12:47 IST

లండన్‌: పరుగులు చేయడం.. ఫామ్‌ కోల్పోవడం ఆటలో భాగమేనని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నారు. ఆటగాళ్లు త్వరలోనే పరుగుల వరద పారిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పొరపాట్లు తగ్గించుకొనేందుకు, సునాయాసంగా ఆడేందుకు కుర్రాళ్లు నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తున్నారని వెల్లడించారు. నాలుగోరోజు ఆట ముగిశాక ఆయన మాట్లాడారు.

విదేశాల్లో బ్యాట్స్‌మెన్‌ పదేపదే విఫలమవ్వడం తనపై ఒత్తిడి పెంచుతోందా అని ప్రశ్నించగా రాఠోడ్‌ లేదని జవాబిచ్చారు. ‘కానీ.. మేం చాలా శ్రమిస్తున్నాం. కుర్రాళ్లతో కలిసి కఠినంగా కృషి చేస్తున్నాం. మెరుగ్గా సాధన చేస్తుంటే, అత్యుత్తమంగా ఆడుతుంటే ఫలితాలు వాటంతటవే వస్తాయి. మంచి రోజులూ వస్తాయి’ అని ఆయన తెలిపారు.

‘క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌కు అప్పుడప్పుడు గడ్డు దశ ఎదురవుతుంటుంది. ఎవరైనా సరే వాటిని అనుభవించి తీరాల్సిందే. తీవ్రంగా కృషి చేస్తూ ప్రక్రియపై దృష్టిసారిస్తే సహాయ సిబ్బంది సహకారంతో దాన్నుంచి బయటపడొచ్చు. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎవరైనా కష్టపడ్డా,  విఫలమైనా మేమూ వారి బాధను అర్థం చేసుకుంటాం. మా బ్యాట్స్‌మెన్‌పై నమ్మకముంది. వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కష్టపడుతున్నారు. త్వరలోనే పరుగుల వరద పారుతుంది’ అని రాఠోడ్‌ అన్నారు.

కుర్రాళ్లపై వ్యక్తిగతంగానూ దృష్టిసారిస్తామని రాఠోడ్‌ తెలిపారు. పుల్‌షాట్‌ను మరింత నిక్కచ్చిగా ఎంపిక చేసుకోవాలని రోహిత్‌కు సూచించామన్నారు. ‘విశ్లేషణ చేస్తాం. ఔటైన ప్రతిసారీ మాట్లాడతాం. అప్పుడెలా ఆలోచించారు? ఎలాంటి షాట్‌ ఆడాలనుకున్నారో తెలుసుకుంటాం. ఉదాహరణకు పుల్‌షాట్‌ ద్వారా రోహిత్‌ ఎక్కువ పరుగులు చేస్తాడు. కానీ ఎక్కువ సార్లు ఔటయ్యేదీ అదే షాట్‌కు. అందుకే మరింత స్పష్టతతో ఆ షాట్‌ ఆడాలని అతడికి సూచించాం. ఇక విరాట్‌ కోహ్లీ ఏకాగ్రత కోల్పోవడంతోనే రెండో ఇన్నింగ్స్‌లో ఔటయ్యాడు. మరేం సమస్యలు లేవు. ఐదోరోజు బంతి ఎలా స్పందిస్తుందో చూడాలి! 200+ లక్ష్యం నిర్దేశిస్తే ఇంగ్లాండ్‌కు ఆఖరి రోజు కష్టమే’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని