IPL 2021: ధోనీని ‘కింగ్‌ కాంగ్‌’ అని పిలవొచ్చు: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా సారథిగా మహేంద్రసింగ్‌ ధోనీ అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. తన నాయకత్వంతో టీమ్‌ఇండియాకు ఎన్నో అపురూప విజయాలు అందిచడమే కాకుండా మేటి జట్టుగా తీర్చిదిద్దాడు...

Published : 04 Oct 2021 01:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథిగా మహేంద్రసింగ్‌ ధోనీ అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. తన నాయకత్వంతో టీమ్‌ఇండియాకు ఎన్నో అపురూప విజయాలు అందిచడమే కాకుండా మేటి జట్టుగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ సారథికీ సాధ్యం కాని విధంగా అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలుపొందిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అత్యుత్తమ జట్లలో ఒకటిగానూ నిలిపాడు. ఈ రికార్డులన్నీ అందరికీ తెలిసినవే. తాజాగా భారత హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి సైతం ధోనీని మెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరన్నాడు. అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మహీ చిరస్థాయిగా నిలిచిపోయే సారథి. ఐసీసీ టోర్నమెంట్లలో అతడి రికార్డులు చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతుంది. అతడు సాధించలేనిది ఏముంది? మూడుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీలు, ఛాంపియన్స్‌ లీగులు, మూడు ఐసీసీ ట్రోఫీలు. ఇవన్నీ మహీ సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. అతడికి చేరువలో కూడా ఎవరూ లేరు. అతడెప్పటికీ ఇలాగే ఉండాలి. మీరు అతడిని ‘కింగ్‌ కాంగ్‌’ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అతడు కెప్టెన్సీ చేపట్టేటప్పుడు మ్యాచ్‌ మొత్తం అతడి ఆధీనంలో ఉంటుంది. పరిస్థితులు అన్ని అదుపులో ఉంటాయి. మరోవైపు బ్యాటింగ్‌లోనూ సిక్సులు, ఫోర్లతో అలరిస్తాడు’ అని శాస్త్రి పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదిలా ఉండగా.. గతేడాది ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై జట్టును ధోనీ.. ఈసారి అందరికన్నా ముందు టాప్‌లో ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. మరోవైపు ఈ ఐపీఎల్‌ తర్వాత టీ20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు మెంటార్‌గా కొనసాగనున్నాడు. దీంతో ధోనీ పర్యవేక్షణలో కోహ్లీసేన మరో పొట్టి  కప్ సాధిస్తుందేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని