Tokyo Olympics: షాట్‌పుట్‌ ఫైనల్స్‌కు చేరలేకపోయిన తజిందర్‌పాల్‌ సింగ్‌

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో తజిందర్‌పాల్‌ సింగ్‌ ఫైనల్స్‌కు చేరలేకపోయాడు. ఒలింపిక్స్‌లో పదకొండో రోజు షాట్‌పుట్‌ విభాగంలో పోటీపడిన అతడు గంటలోనే ఇంటిముఖం పట్టాడు...

Updated : 03 Aug 2021 18:21 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో తజిందర్‌పాల్‌ సింగ్‌ ఫైనల్స్‌కు చేరలేకపోయాడు. ఒలింపిక్స్‌లో పదకొండో రోజు షాట్‌పుట్‌ విభాగంలో పోటీపడిన అతడు గంటలోనే ఇంటిముఖం పట్టాడు. మొత్తం 15 మంది పోటీపడిన ఈ ఈవెంట్‌లో తజిందర్‌ తొలి ప్రయత్నంలో 19.99 మీటర్ల ప్రదర్శన చేశాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో అతడు ఫౌల్‌ కావడంతో చివరికి 13వ స్థానంలో నిలిచాడు. దాంతో ఈ విభాగంలో పెట్టుకున్న అంచనాలు కూడా తలకిందులయ్యాయి. తొలి ప్రయత్నంలో మంచి ప్రదర్శన చేసిన అతడు తర్వాత ఫౌల్స్‌ వేయడంతో ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఫైనల్స్‌కు చేరలేకపోయాడు.

కాగా, తజిందర్‌ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి ఈవెంట్‌లో 21.49 మీటర్ల ప్రదర్శన చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఆ ప్రదర్శనతోనే అతడు ఈ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్‌ ఫైనల్‌ పోటీలకు చేరే క్రమంలో తజిందర్‌ విఫలమయ్యాడు. కాగా, ఈ ఈవెంట్‌లో బ్రెజిల్‌కు చెందిన డార్లాన్‌ రోమాని రెండో ప్రయత్నంలో 21.31 మీటర్ల ప్రదర్శన చేయడంతో అతడు అత్యుత్తమ ప్రదర్శన కింద నేరుగా ఫైనల్‌కు చేరాడు. ఈ షాట్‌పుట్‌ ఈవెంట్‌లో అథ్లెట్లు ఎవరైతే 21.20 మీటర్లను చేరుకుంటే వాళ్లు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తారు. కాగా, తజిందర్‌ వైఫల్యంతో భారత్‌ మంగళవారం మూడు పెద్ద అవకాశాలు కోల్పోయింది. తొలుత భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో ఓటమిపాలవ్వగా.. ఆపై రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ ఓపెనింగ్‌ రౌండ్‌లోనే విఫలమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని