Rewind 2021: ఫేవరెట్లకు తీవ్రనిరాశ.. అంచనాల్లేకుండానే జగజ్జేత

సంవత్సరం పొడవునా క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. అయితే గతేడాది కరోనా ...

Updated : 19 Dec 2021 15:00 IST

టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌పై ప్రత్యేక కథనం

ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం: సంవత్సరం పొడవునా క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినా.. ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లకు ఉండే క్రేజే వేరు. అయితే, గతేడాది ద్వితీయార్ధంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాస్త నెమ్మదించినా... ప్రస్తుత సంవత్సరంలో మాత్రం మళ్లీ మ్యాచ్‌లు ఊపందుకున్నాయి. వరుస షెడ్యూల్‌తో ఆటగాళ్లు బిజీగా గడిపేశారు. ఈ ఏడాది  ఐసీసీ మెగా ఈవెంట్ ఏదైనా జరిగిందంటే అది టీ20 ప్రపంచకప్. మొత్తం 12 జట్లు ఈ టైటిల్ కోసం తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మహా సంగ్రామంలో ఫేవరెట్లు డీలాపడగా.. ఎలాంటి ఆశలు లేని జట్లు ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం. మరి ఆ విశేషాలను year ending సందర్భంగా ఓసారి చూద్దాం.. 

గతేడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ కరోనా కారణంగా వాయిదా పడి.. యూఏఈ వేదికగా ఈ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు జరిగింది. నేరుగా ఎనిమిది జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయిర్స్‌ మ్యాచుల్లో టాప్‌లో నిలిచిన నాలుగు టీమ్‌లు అదనంగా చేరాయి. దీంతో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్‌ కోసం తలపడ్డాయి. గ్రూప్‌-1లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అప్గానిస్థాన్, నమీబియా, స్కాట్లాండ్‌ జట్లకు ఐసీసీ గ్రూప్‌-2లో స్థానం కల్పించింది. పాయింట్ల పరంగా ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్‌ -2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు వెళ్లాయి. అయితే, పాక్‌ మీద ఆసీస్, ఇంగ్లాండ్‌ మీద కివీస్‌ గెలిచి ఫైనల్‌కు చేరాయి. తుది పోరులో న్యూజిలాండ్‌ మీద ఆస్ట్రేలియా విజయం సాధించి కప్‌ను ఎగరేసుకుపోయింది.

ఫేవరేట్లుగా బరిలోకి దిగి..

ఇక టీ20 ప్రపంచకప్‌ 2021 ప్రస్థానంలో మన భారత్‌ జట్టు విషయానికొస్తే.. అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కాస్త సులువైన గ్రూప్‌లో పడ్డామనే ఆనందం మిగల్లేదు. పాక్, కివీస్‌ మినహా మిగతా మూడు జట్లు అఫ్గానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌ నుంచి పెద్దగా ప్రతిఘటన ఉండదు. పాక్‌, కివీస్‌ జట్లలో ఏదో ఒక మ్యాచ్ గెలిచి, మిగతా మూడు జట్ల మీద విజయాలు సాధిస్తే నాకౌట్‌ (సెమీస్) దశకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, టోర్నీ ఆరంభ మ్యాచ్ భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య కావడం.. ఇప్పటి వరకు ఐసీసీ మెగా ఈవెంట్లలో దాయాది దేశంపై ఓడిన చరిత్ర లేకపోవడంతో భారత అభిమానులు కంగారు పడలేదు. అయితే, అంచనాలను తారుమారు చేస్తూ పాకిస్థాన్‌ చెలరేగిపోయింది. ఆ జట్టు ముందు టీమ్‌ఇండియా తేలిపోయింది. సరే ఒత్తిడితో ఓడిపోయిందిలే అనుకుని అభిమానులు కాస్త సర్ది చెప్పుకున్నారు. మరోవైపు కివీస్‌ కూడా పాక్‌ చేతిలో భంగపాటుకు గురికావడంతో.. కివీస్‌తో గెలిస్తే సెమీస్‌ అవకాశాలు మనకే ఉంటాయని నమ్మకంతో ఉన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్వని భారత క్రికెటర్లు మరోసారి కివీస్‌ ఎదుట చేతులెత్తేశారు. ఇక మిగతా మూడు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించినా.. కివీస్‌ కూడా మనతోపాటు ఆ మూడు జట్లపై గెలిచి సెమీస్‌లో బెర్తును ఖరారు చేసుకుంది. పాకిస్థాన్‌ అయితే ఓటమి లేకుండా ఐదు విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమ్‌ఇండియాకు రెండో కప్‌ కోసం మరికొన్నేళ్లు నిరీక్షణ తప్పని పరిస్థితి నెలకొంది. ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీని వదిలేస్తానని ప్రకటించిన విరాట్‌ కోహ్లీ.. సారథిగా తన చివరి టోర్నీలో భారత్‌ను విజేతగా నిలపలేకపోయాడు. వచ్చే ఏడాది (2022) మళ్లీ టీ20 ప్రపంచకప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ సారైనా కొత్త సారథి రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్‌ఇండియా కప్‌ను సాధించాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. 

టీ20 ఛాంపియన్‌కీ తప్పని భంగపాటు

మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందన్నట్లు తయారైంది వెస్టిండీస్‌ పరిస్థితి. అసలు విండీస్‌ గత టీ20 ఛాంపియన్‌ (2012, 2016). రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక దేశం. విండీస్‌ జట్టులో అందరూ టీ20 స్పెషలిస్ట్‌లే. గేల్‌, సిమన్స్, లూయిస్, హెట్‌మెయిర్‌, బ్రావో, పొలార్డ్, రస్సెల్, పూరన్‌... ఇలా అందరూ మ్యాచ్‌ విన్నర్లే. అయితే, టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే దిమ్మతిరిగే ఫలితం వెలువడింది. ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయం పాలైంది. అంతమంది హిట్టర్లు ఉన్న విండీస్‌ కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇంగ్లాండ్‌ కూడా నాలుగు వికెట్లు కోల్పోయినా 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గ్రూప్‌లో మొత్తం ఐదు మ్యాచులు ఆడిన విండీస్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ (బంగ్లాపై) విజయం సాధించింది. అది కూడా అతి కష్టంమీద విజయం సాధించడం గమనార్హం. దీంతో విండీస్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంతో టోర్నమెంట్‌ను ముగించింది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు డ్వేన్‌ బ్రావో వీడ్కోలు పలికాడు. 

గ్రూప్‌ టాపర్లుగా నిలిచి...

అంచనాలకు అందని విధంగా పాకిస్థాన్‌ ఈసారి విజయాలు సాధించింది. భారత్, కివీస్‌ వంటి హేమాహేమీ జట్లను ఓడించింది. ఇక అఫ్గానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌లపై ఆధిపత్యం సరేసరి. గ్రూప్‌ మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే నాకౌట్‌ దశలో ఆసీస్‌ చేతిలో పరాభవం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో.. షహీన్‌ అఫ్రిది ఒకే ఒక్క ఓవర్‌లో మూడు సిక్సర్లు ఇవ్వడంతో ఓటమి పాలైంది. అప్పటి వరకు విజయం మీద భరోసాగా ఉన్న పాక్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆసీస్‌ బ్యాటర్‌ వేడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసిన హసన్‌ అలీపై విమర్శలు గుప్పించారు. అయితేనేం ఆ రెండు సంఘటనలు తప్ప టోర్నమెంట్‌లో పాక్‌ ఆటతీరును అందరూ ప్రశంసించారు. 

ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌ కూడా ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగానే ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో గ్రూప్‌ స్థాయిలో టాప్‌ ర్యాంక్‌ సాధించింది. కఠినమైన గ్రూప్‌లో తొలి స్థానంలో నిలవడం అంటే సాధారణ విషయం కాదు. అన్ని జట్లూ పటిష్టమైనవే. తొలి మ్యాచ్‌లోనే విండీస్‌ను ఓడించి ఘనంగా టోర్నమెంట్‌ను ప్రారంభించింది. వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లాండ్‌కు లీగ్‌ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. అయితే, అప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న ఇంగ్లాండ్‌కు పెద్ద నష్టమేమీ జరగలేదు.. కానీ ఆ ఓటమే హెచ్చరికగా పరిగణించాల్సిన ఇంగ్లాండ్‌ తేలిగ్గా తీసుకుందేమో.. సెమీస్‌లో కివీస్‌ చేతిలో పరాభవం పాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ను అందుకోవాలన్న ఆశలు నీరుకారిపోయాయి.

అంచనాల్లేవు..  అన్నీ సంచలనాలే

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విండీస్‌.. టోర్ని ఫేవరెట్‌ భారత్‌ గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాయి. మరోవైపు పాకిస్థాన్‌ అసాధారణమైన ఆటతీరుతో సెమీస్‌కు చేరుకొంది. ఇంకోవైపు వన్డే వరల్డ్‌ కప్‌ స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్‌ను గెలవాలనే కసితో ఇంగ్లాండ్... నిలకడకు మారుపేరైన కివీస్‌ సులువుగానే సెమీస్‌ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. మొన్నటి వరకు క్రికెట్‌ ప్రపంచంలో ఆ జట్టు పేరు వింటే ఎటువంటి ప్రత్యర్థి అయినా వణకాల్సిందే. అయితే పొట్టి ఫార్మాట్‌లో గొప్పగా గణాంకాలు ఏమీ లేవు.. టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా అంచనాలు లేని జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. అంతేకాకుండా నెట్‌రన్‌రేట్‌ పై ఆధారపడి సెమీస్‌కు చేరుకుంది. అసలు కథ అప్పటి నుంచే మొదలైనట్లుగా ఆసీస్‌ చిరుతలా రెచ్చిపోయింది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన పాక్‌ను సెమీస్‌లో చిత్తు చేసి.. ఫైనల్‌లోనూ కివీస్‌ను కంగారు పెట్టించి కప్‌ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతకుముందు రెండు దశల్లో జరిగిన ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో రాణించని డేవిడ్‌ వార్నర్ టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా నిలవడం విశేషం.

ప్రతీకారం తీరింది.. కప్ చేజారింది..!

గ్రూప్‌-2లో రెండో స్థానంతో న్యూజిలాండ్‌ సెమీస్‌కు వెళ్లింది. గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ జట్టు పాక్‌పై కాకుండా మిగతా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక సెమీస్‌లో గత ప్రత్యర్థి (వన్డే వరల్డ్ కప్‌ ఫైనలిస్ట్) ఇంగ్లాండ్‌ ఎదురుపడింది. ఈ సారి గెలిచి ఎలాగైనా నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్‌ భావించింది. అందుకు తగ్గట్టుగానే నిలకడగా, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాదే జరిగిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో గెలిచిన కివీస్‌.. మరొక ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరింది. అయితే, ఆసీస్‌ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను గెలుచుకోవడంతో కివీస్‌ ఆశలు అడియాసలు అయ్యాయి. ఇంగ్లాండ్‌పై గెలిచి వన్డే వరల్డ్‌ కప్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోగలిగామనే సంతృప్తితో టోర్నమెంట్‌ను ముగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని