ఇండియా అంటే ఇది: సెహ్వాగ్‌ 

ఆస్ట్రేలియాలో అద్భుత విజయం సాధించి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్‌ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న...

Updated : 22 Jan 2021 08:46 IST

ఇక్కడ క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాలో అద్భుత విజయం సాధించి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్‌ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న అతడు తర్వాత రోడ్డు మార్గంలో తమిళనాడులోని సాలెం జిల్లా చిన్నప్పంపట్టి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడికి నీరాజనాలు పట్టారు. పూలమాలలు, డప్పువాయిధ్యాలతో స్వాగతం పలికారు. రథంపై ఊరేగిస్తూ సందడి చేశారు. నటరాజన్‌ అక్కడి వారికి అభివాదం చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  

ఈ క్రమంలోనే నటరాజన్‌కు లభించిన ఆదరణ చూసిన టీమ్ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. నటరాజన్‌ ఊరేగింపు వీడియోను పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇండియా అంటే ఇది. ఇక్కడ క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువ. నటరాజన్‌ కు  చిన్నప్పంపట్టి గ్రామంలో ఘన స్వాగతం లభించింది’ అని కొనియాడాడు.

కాగా, నటరాజన్‌ తొలుత ఐపీఎల్‌ కోసం ఆగస్టులో యూఏఈకి వెళ్లాడు. అక్కడ హైదరాబాద్‌ తరఫున రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌ బౌలర్‌గా ఎంపికై అక్కడికి చేరుకున్నాడు. అయితే, అనూహ్యంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున ఇలా ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే అంచనాలకు మించి రాణించి విశేష ఆదరణ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్వగ్రామంలో అతడికి ఘన స్వాగతం లభించింది. 

ఇవీ చదవండి..
అమ్మో.. టీమ్‌ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్‌ సందేశం పంపించారు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని