IPL 2023: నా జీవితంలో నేనెప్పటికీ మరిచిపోలేను: వీరేంద్ర సెహ్వాగ్‌

టీమ్‌ఇండియా (Team India) మాజీ డ్యాషింగ్‌ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఐపీఎల్‌ (IPL)లోనూ అదరగొట్టేశాడు. తొలి సీజన్‌ ప్రారంభమైన సందర్భంలో ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నట్లు సెహ్వాగ్‌ తెలిపాడు. 

Published : 19 Feb 2023 01:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) 16వ సీజన్‌ షెడ్యూల్‌ ఇప్పటికే వచ్చేసింది. తొలిసారి 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌.. నిరాటంకంగా పదిహేను సీజన్లను పూర్తి చేసుకొంది. అయితే మొదటి సీజన్‌లో చోటు చేసుకొన్న సంఘటనలను టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ గుర్తుకు తెచ్చుకొన్నాడు. ఆసీస్‌ పర్యటనలో ఉన్నప్పుడు ఆటగాళ్లందరికీ క్రికెట్‌ దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి టోర్నీ గురించి చెప్పినట్లు సెహ్వాగ్‌ తెలిపాడు. దిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున ఆడిన సెహ్వాగ్‌.. ఐపీఎల్‌ ఇంత విజయవంతమవుతుందని మాత్రం ఊహించలేదని చెప్పాడు. ఐపీఎల్‌ 15 వసంతాలను పూర్తి చేసుకొన్న క్రమంలో ఓ క్రీడా ఛానెల్‌ నిర్వహించిన ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో సెహ్వాగ్‌ మాట్లాడాడు. 

‘‘మెగా టోర్నీ గురించి మాకు సంక్షిప్తంగా చెప్పిన సందర్భాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. అప్పుడు మేమంతా ఆస్ట్రేలియాలో ఉన్నాం. సునీల్‌ గావస్కర్, రవిశాస్త్రి మాతో మాట్లాడాలని చెప్పి సమావేశపరిచారు. అప్పుడే తొలిసారి ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL)గా వివరించారు. తప్పకుండా భవిష్యత్తులో భారీ లీగ్‌గా మారుతుందని వారికి ముందే అర్థమైపోయింది. ఈ లీగ్‌ ద్వారా ఎలాంటి హక్కులు వచ్చినా.. ఇప్పుడున్న సంపాదన కంటే చాలా రెట్లు ఆర్జిస్తారని భరోసాగా చెప్పారు. ఇక్కడ డబ్బు అనేది రెండో ప్రాధాన్యత అంశం.. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఆటగాళ్లకు అవకాశం రావడం మాత్రం అద్భుతం. ఇలాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌ ప్లేయర్లకు దొరకడం నిజంగా అదృష్టమే’’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్‌ రెండు శతకాలు, 16 అర్ధశతకాలతో 2,728 పరుగులు సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని