Pakistan: అగ్నికి ఆజ్యం పోయకండి: వసీమ్‌ అక్రమ్‌

టీ20 ప్రపంచకప్‌ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌ ఓటమికి ఆ జట్టు ఆటగాడు హసన్‌ అలీనే కారణమంటూ పాక్‌ క్రికెట్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తను ఆసీస్‌ ఆటగాడు మాథ్యు వాడే ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకొని ఉంటే.. పాక్‌ మ్యాచ్‌ గెలిచేదని, బంతిని వదిలేసి తప్పు చేశాడంటూ అతడిపై విమర్శలు

Published : 13 Nov 2021 01:08 IST

ఇస్లామాబాద్‌: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌ ఓటమికి ఆ జట్టు ఆటగాడు హసన్‌ అలీనే కారణమంటూ పాక్‌ క్రికెట్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఆసీస్‌ బ్యాటర్‌ వేడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకొని ఉంటే.. పాక్‌ మ్యాచ్‌ గెలిచేదని, బంతిని వదిలేసి తప్పు చేశాడంటూ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పాక్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ స్పందిస్తూ హసన్‌ తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా దీనిపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ స్పందించారు. ఇప్పటికే పాక్‌ జట్టు తీవ్ర నిరాశతో ఉందని.. హసన్‌ను విమర్శిస్తూ అగ్నికి ఆజ్యం పోయొద్దని ప్రజలను కోరారు.

‘‘ప్రస్తుత పరిస్థితి(మ్యాచ్‌ ఓటమిని ఉద్దేశించి) క్రికెటర్లకు, అభిమానులకు కష్టతరమైందే. ఆట ముగియగానే.. నిరాశతో ఆటగాళ్లంతా వారి గదుల్లోకి వెళ్లి బాధపడతారు. ఎవరితోనూ మాట్లాడరు. మ్యాచ్‌ ఓటమి వారిని వెంటాడుతుంటుంది. అలాంటప్పుడు దేశ ప్రజలమైన మనం.. అగ్నికి ఆజ్యం పోసినట్లు వారిని బాధపెట్టకూడదు. ఇప్పుడు ప్రజలంతా హసన్‌ అలీని నిందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నేను, వాకర్‌ యునీస్‌ ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లో అయితే, ఇది కేవలం ఒక ఆట మాత్రమే. మరుసటి రోజు బాగా ప్రయత్నించారు.. ఇది దురదృష్టకరం అని ఊరుకుంటారు’’అని వసీమ్‌ అక్రమ్‌ అన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు అనుకూలంగా సాగిన ఈ మ్యాచ్‌.. చివర్లో వేడ్‌ మెరుపు ఇన్నింగ్‌ ఆడటంతో ఆసిస్‌ వశమైంది. దీంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఆ దేశ జట్టు ఆటగాడు హసన్‌ అలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని