IND vs BAN: విరాట్ వికెట్‌ అద్భుతం.. నాలుగో రోజు త్వరగా రెండు వికెట్లు తీస్తే చాలు: మెహిదీ

ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. భారత్‌ వంద కొడితే చాలు.. బంగ్లాదేశ్‌ ఆరు వికెట్లను తీస్తే విజయం సాధిస్తుంది. ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

Published : 24 Dec 2022 22:09 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన మూడు రోజుల ఆటలో అత్యధిక భాగం టీమ్‌ఇండియాదే ఆధిపత్యం  కొనసాగినప్పటికీ.. కీలకమైన లక్ష్య ఛేదనలో బంగ్లా స్పిన్నర్లు భారత టాప్‌ ఆర్డర్‌ నడ్డి విరిచారు. 145 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా మూడో రోజు ఆట ముగిసేసమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇంకో వంద పరుగులు చేస్తే భారత్‌ విజయం సాధిస్తుంది. 

భారత టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేయడంలో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మెహిదీ హసన్ మిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీయగా.. అందులో విరాట్ కోహ్లీతోపాటు పుజారా, శుభ్‌మన్ గిల్‌ వికెట్లను తీశాడు. బంగ్లాను పోటీలో నిలిపిన మెహిదీ హసన్ మ్యాచ్‌ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాలుగో రోజు ఆరంభంలో వికెట్లను పడగొడితే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంది. రేపు తప్పకుండా ఇంకా ఉత్తమంగా బౌలింగ్‌ చేస్తాననే నమ్మకం ఉంది’’ అని తెలిపాడు. 

తమ జట్టు పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు సాగుతోందని మెహిదీ చెప్పాడు. ‘‘పిచ్‌పై బంతి చాలా టర్నింగ్‌ అవుతోంది. మేం పాజిటివ్‌ దృక్పథంతో ఆడేందుకు ప్రయత్నించాం. నాలుగో రోజు త్వరగా రెండు వికెట్లు తీస్తే.. తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం మాకుంది. ఇక కోహ్లీకి సంధించిన బంతి అద్భుతం. మరింత టర్న్‌ కావడంతో వికెట్‌ దక్కింది’’ అని మెహిదీ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని