Sachin - Virat: సచిన్‌.. కోహ్లీ.. 49 సెంచరీలు.. వీరి తర్వాత ఎవరున్నారు?

వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించింది ఎవరు? అని అంటే సచిన్‌ తెందూల్కర్‌, విరాట్ కోహ్లీ అని చెబుతాం. మరి ఆ తర్వాత దగ్గరగా ఉన్నది ఎవరు? 

Published : 05 Nov 2023 20:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar)కి చెందిన ఓ రికార్డును కింగ్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదివారం సమం చేసేశాడు. 49వ సెంచరీ బాది శతకాల పట్టికలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సరసన చేరిపోయాడు. మరో వంద కొట్టి సచిన్‌ రికార్డును బద్దలు కొట్టడానికి విరాట్‌ ఇంకా ఎంతో సమయం తీసుకోకపోవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఆ తర్వాత ఎవరున్నారనేదే? దీనికి సమాధానం ఇదీ...

రోహిత్‌ మూడులో..

ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌తో సమకాలీన క్రికెట్‌ ఆడుతున్నవారి జాబితా ఓసారి చూస్తే... ఆసక్తికర పేర్లు కనిపిస్తాయి. అయితే వాళ్లెవరూ కోహ్లీ రికార్డుకు దరిదాపుల్లోకి వచ్చే అవకాశం లేదు. మూడో స్థానంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (31 శతకాలు) ఉన్నాడు. 36 ఏళ్ల రోహిత్‌ కోహ్లీ రికార్డును కొట్టే పరిస్థితి లేదు. అయితే తన సెంచరీల సంఖ్యను ఇంకాస్త పెంచుకుంటాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ 37 ఏళ్ల డేవిడ్‌ వార్నర్‌ 22 శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. అయితే ప్రపంచకప్‌ తర్వాత వార్నర్‌ రిటైర్‌ అవుతాడు అనే టాక్‌ ఒకటి క్రికెట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో ప్రపంచకప్‌ తర్వాత రిటైర్‌ అవ్వబోయే దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ ఉన్నాడు. 22 శతకాలతో డికాక్‌ ప్రేక్షకుల్ని అలరించాడు. అన్నట్లు ఈ ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌ డికాక్‌ (550) కావడం గమనార్హం.

చాలా మంది ఉన్నా...

డికాక్‌ తర్వాత ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నది పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌. 19 శతకాలతో బాబర్‌ కెరీర్‌ హైలో కొనసాగుతోంది. అయితే 29 ఏళ్ల బాబర్‌ ఇంకొన్నాళ్లు ఆడే అవకాశం ఉంది. అప్పుడూ ఇదే జోరు చూపిస్తే రికార్డుకు దగ్గరగా రావొచ్చు. ఆ తర్వాత వినిపించే పేరు జో రూట్‌. 32 ఏళ్ల ఈ ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ ఇప్పటివరకు 16 శతకాలు సాధించాడు. అయితే ఈ క్లాస్‌ ప్లేయర్‌ సెంచరీల మారథాన్‌ ఎంతవరకు వస్తుందో చూడాలి. రూట్‌ తర్వాత కేన్‌ విలయమ్స్‌ (13), స్టీవ్‌ స్మిత్‌ (12), ఫకర్‌ జమాన్‌ (11), జానీ బెయిర్‌స్టో (11), జాస్‌ బట్లర్‌ (11) ఉన్నారు. ఈ లిస్ట్‌ చూస్తే వీళ్లలో ఎవరూ విరాట్‌ రికార్డుకు దగ్గరగా వచ్చే పరిస్థితి లేదు. కానీ యువ క్రికెటర్లకు ఆ ఛాన్స్‌ ఉంది.  ఆ ఘనతను ఎవరు సాధిస్తారో చూడాలి మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని