WTC Final: పోరాడుతున్న టీమ్‌ఇండియా.. నాలుగో రోజు ముగిసిన ఆట

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో భారత్‌ పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

Updated : 10 Jun 2023 22:50 IST

లండన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో భారత్‌ పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44*), అజింక్య రహానె (20*) పరుగులతో ఉన్నారు. భారత్‌ విజయానికి ఇంకా 280 పరుగులు అవసరం. రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. శుభ్‌మన్‌ గిల్ (18), చెతేశ్వర్‌ పుజారా (27) మరోసారి నిరాశపర్చారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, నాథన్‌ లైయన్‌ తలో వికెట్‌ తీశారు.

ఆరంభం అదిరినా.. 

భారీ లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియాకు మంచి ఆరంభమే దక్కిందని చెప్పాలి. కమిన్స్‌ వేసిన మూడో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ రెండు ఫోర్లు, రోహిత్‌ ఒక ఫోర్‌ రాబట్టారు. బొలాండ్ వేసిన తర్వాతి ఓవర్‌లో హిట్‌మ్యాన్‌ మరో బౌండరీ బాదాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ దూకుడు కొనసాగిస్తూ స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదాడు. 7 ఓవర్లకు 41/0తో నిలిచి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఏర్పడుతున్న సమయంలో శుభ్‌మన్ గిల్‌ను బొలాండ్ పెవిలియన్‌కు పంపాడు. గిల్‌ స్లిప్‌లో కామెరూన్‌ గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే టీ విరామం ప్రకటించారు. అనంతరం పుజారాతో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ నిలకడగా ఆడి రెండో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధ శతకం దిశగా సాగుతున్న రోహిత్‌ నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కమిన్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనే చెతేశ్వర్‌ పుజారా వికెట్ కీపర్‌ కేరీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 93 పరుగులకే టీమ్‌ఇండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానె మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 

ఓవర్‌ నైట్‌ స్కోరు 123/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ (41) ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడబోయి స్లిప్‌లోని పుజారా చేతికి చిక్కాడు. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. లంచ్‌ బ్రేక్‌కు ముందు జడేజా బౌలింగ్‌లో కామెరూన్‌ గ్రీన్ (25) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో  భోజన విరామ సమయానికి 201/6తో నిలిచింది. రెండో సెషన్ ఆరంభం నుంచి మిచెల్ స్టార్క్‌ (41; 57 బంతుల్లో) నిలకడగా బౌండరీలు సాధించాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. షమి బౌలింగ్‌లోనూ వరుసగా రెండు ఫోర్లు బాదిన స్టార్క్‌.. అదే ఓవర్లో  స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే షమి బౌలింగ్‌లోనే కమిన్స్‌ (5) అక్షర్ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చిన వెంటనే ఆసీస్‌ డిక్లేర్డ్ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని