ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్‌ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్‌ సింగ్‌

శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) బ్యాటింగ్‌పై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ పొగడ్తల జల్లు కురిపించాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు కీలకంగా మారతాడని అభిప్రాయపడ్డాడు.

Published : 01 Oct 2023 13:12 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై (Gill) మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ క్రికెటర్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. 24 ఏళ్ల గిల్‌లో ఆ సత్తా ఉందన్న విషయాన్ని అతడి బ్యాటింగ్‌ గణాంకాలే చెబుతాయని యువీ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రెండు మ్యాచుల్లోనూ గిల్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడిన విషయాన్ని అతడు గుర్తు చేశాడు. వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున గిల్ కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నాడు. 

‘‘శుభ్‌మన్‌ గిల్ ఆట తీరును చూస్తే ముచ్చటేస్తోంది. ఈ తరం అత్యుత్తమ క్రికెటర్‌గా అవతరిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడిలో ఆ సత్తా ఉంది. గత నాలుగైదేళ్లుగా అతడి ఆలోచనా దృక్పథం అత్యున్నత స్థాయిలో ఉంది. సాధారణ ఆటగాడిగా కంటే నాలుగు రెట్లు అదనంగా శ్రమిస్తాడు. చిన్నప్పటి నుంచీ ఇలానే ఉన్నాడు. నేను కూడా గతంలో అతడితో ఆడాను. 

గిల్‌ రాణిస్తే మాత్రం భారత్‌ మ్యాచ్‌ల్లో సులువుగా విజయం సాధిస్తుంది. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. భారత్‌ తరఫున చివరి టెస్టు మ్యాచ్‌లో 91 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా గెలిచింది. ఆసీస్‌తో తొలిసారి వన్డే సిరీస్‌లోనూ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇలా ఎవరూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించలేరు. కేవలం భారత్‌లోనే కాకుండా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మైదానాల్లో కూడా భారీగా పరుగులు చేయగలడు’’ అని యువీ తెలిపాడు. 

గిల్ నాలుగేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. తొలుత వన్డేల్లో (2019లో), తర్వాత టెస్టుల్లోకి (2020) అరంగేట్రం చేసిన గిల్ ఈ ఏడాదే తొలిసారి అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇప్పటి వరకు 18 టెస్ట్లులు, 35 వన్డేలు, 11 టీ20ల్లో 3,200కిపైగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న గిల్ అత్యంత వేగంగా 1000కిపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా అవతరించాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఏడాది ఆ మార్క్‌ను తాకాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ (208) కూడా అతడి ఖాతాలో చేరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని