Ruturaj Gaikwad: సచిన్‌ రికార్డును సమం చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌

చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మెగా టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును సమం చేశాడు. గత రాత్రి హైదరాబాద్‌తో

Published : 02 May 2022 12:19 IST

(Photo: Ruturaj Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మెగా టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును సమం చేశాడు. గత రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్‌ ఈ ఘనత సాధించాడు.

ఆదివారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. 6వ ఓవర్‌లో జన్‌సెన్‌ వేసిన తొలి బంతికి సిక్స్‌ కొట్టి రుతురాజ్‌ ఈ మెగా టోర్నీలో 1000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 31 మ్యాచ్‌ల్లోనే వెయ్యి పరుగులు సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు సచిన్‌ పేరుపై ఉన్న రికార్డును రుతురాజ్‌ సమం చేశాడు. వీరిద్దరి తర్వాత సురేశ్‌ రైనా (34 మ్యాచ్‌లు), రిషభ్‌ పంత్‌ (35 మ్యాచ్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (35 మ్యాచ్‌లు) అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన వారి జాబితాలో ఉన్నారు.

ఈ ఏడాది మెగా టోర్నీలో ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన రుతురాజ్‌.. నిన్నటి మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్‌ కాన్వేతో కలిసి 182 పరుగుల అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 57 బంతుల్లో 99 పరుగులు సాధించి తృటిలో శతకాన్ని కోల్పోయాడు. మ్యాచ్‌ అనంతరం దీనిపై మాట్లాడుతూ.. ‘‘సొంత గ్రౌండ్‌లో పెద్ద స్కోరు చేయడం ఎప్పటికీ ప్రత్యేకమే. శతకం కోల్పోయినందుకు కాస్త బాధగా ఉన్నప్పటికీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. 99 అయినా 100 అయినా జట్టు గెలుపొందడమే చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని