Android Phone: ఆండ్రాయిడ్ ఫోన్‌లోయాడ్స్‌... రాకుండా చేయాలా?

మొబైల్‌ ఫోన్‌లో విసుగుపుట్టించే యాడ్స్‌ నుంచి తప్పించుకునేందుకు మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లో చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. మరి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం. 

Updated : 19 Dec 2021 14:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతంలో బిల్‌ బోర్డులు, టీవీల్లో మాత్రమే యాడ్స్‌ కనిపించేవి. అవి కాస్తా ఇప్పడు మొబైల్‌ ఫోన్లలోకి వచ్చేశాయి. ఏ బ్రౌజర్‌ ఓపెన్ చేసినా, కమర్షియల్ యాప్‌ డౌన్‌లోడ్ చేసినా యాడ్స్‌ దర్శనమిస్తున్నాయి. అత్యవసరంగా ఫోన్‌ ఉపయోగించేప్పుడు స్క్రీన్‌ మీద యాడ్స్‌ కనిపిస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అవి రాకుండా యాడ్స్‌ బ్లాకింగ్ యాప్స్‌, థర్డ్‌ పార్టీ యాడ్‌ ఆన్స్‌ లాంటివి ఎన్నో ప్రయత్నిస్తుంటాం. వాటి వల్ల యాడ్స్‌ ఆగకపోగా.. మన వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతోంది. అయితే థర్డ్‌పార్టీ యాప్స్‌, యాడ్‌ఆన్స్‌తో సంబంధం లేకుండా కేవలం చిన్నపాటి ట్రిక్‌తో ఫోన్‌ బ్రౌజర్‌, యాప్‌లలో యాడ్స్‌ను మీరు బ్లాక్‌ చేయొచ్చు. ఇందుకోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది.

📵 ముందుగా మీ ఫోన్‌ సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి అందులో ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌ (Private DNS) అని టైప్‌ చేయాలి. లేదా ఫోన్ సెట్టింగ్స్‌లో కనెక్షన్స్‌ (Connections)లోకి వెళ్లి మోర్‌ కనెక్షన్‌ సెట్టింగ్స్‌ (More Connection Settings) ఓపెన్ చేసినా అందులో మీకు ప్రైవేట్ డీఎన్‌ఎస్‌ కనిపిస్తుంది.

📵 దానిపై క్లిక్‌ చేస్తే సెలెక్ట్ ప్రైవేట్ డీఎన్‌ఎస్‌ మోడ్ (Select Private DNS Mode) పేరుతో పాప్‌-అప్ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆఫ్‌ (Off), ఆటోమేటిక్‌ (Automatic), ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌ ప్రొవైడర్‌ హోస్ట్‌నేమ్‌ (Private DNS provider hostname) అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.

📵 వాటిలో ప్రైవేట్ డీఎన్‌ఎస్‌ ప్రొవైడర్‌ హోస్ట్‌నేమ్‌పై క్లిక్ చేసి కింద ఉన్న ఖాళీలో డీఎన్‌ఎస్‌.యాడ్‌గార్డ్‌.కామ్‌ (dns.adguard.com) అని టైప్‌ చేసి సేవ్ చేయాలి. తర్వాత మీరు మొబైల్‌ ఫోన్‌ బ్రౌజర్‌లో ఏ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా, యాప్‌ ఓపెన్ చేసినా యాడ్స్‌ కనిపించవు. అయితే ఇది ఆండ్రాయిడ్ 9.0 పై (Android 9.0 Pie) అంతకు మించిన వెర్షన్‌ ఓఎస్‌లలో మాత్రమే పనిచేస్తుంది.

📵 ఒకవేళ యాడ్స్‌ కావాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌ మోడ్‌ ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. ఈ ట్రిక్‌ వల్ల కొన్ని రకాల వెబ్‌సైట్లు కూడా ఓపెన్ కాకపోవచ్చని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాడ్స్‌ పూర్తిగా వద్దనుకునే వారికి మాత్రం ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని