దక్షిణ గంగ గరళంగా...

దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్‌(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Published : 30 Sep 2021 03:17 IST

బాసర నుంచి భద్రాద్రి దాకా కాలుష్య కోరల్లో గోదావరి నది

విషతుల్యం చేస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు

ఉప నదుల్లోనూ నానాటికీ తీసికట్టుగా నీటి నాణ్యత

ఈనాడు - హైదరాబాద్‌

దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్‌(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

ఎందుకీ పరిస్థితి?

ఇళ్లలోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా వచ్చి నదిలో కలుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని పరిశ్రమల యజమానులు వర్షపునీటిలో రసాయన వ్యర్థాల్ని కలిపేసి నదుల్లోకి వదులుతున్నారు. గోదావరిఖని కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో తాజాగా నదిలో పెద్దమొత్తంలో నురగ ఏర్పడటం కలవరం కలిగిస్తోంది. గోదావరితోపాటు అందులో కలిసే ఉపనదులు, 50కిపైగా నాలాల నుంచి వచ్చే కాలుష్య ప్రభావాన్ని ‘ఈనాడు’ పరిశీలించింది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) 2021 గణాంకాల్నీ ఆరా తీయగా.. పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉందని అర్థమవుతోంది.

ఏ ప్రాంతంలో ఎలా కలుషితం అవుతోందంటే..?

బాసర: మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ ఇక్కడికి 5 కి.మీ. దూరమే. అక్కడి ఓ మద్యం కంపెనీ.. శుద్ధిచేయని రసాయన వ్యర్థాల్ని వదులుతోంది. ఏడాదంతా పరిశ్రమ ఆవరణలో నిల్వచేసి వర్షాకాలం రాగానే నదిలోకి పంపిస్తుండటంతో బాసర వద్ద గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి.
రామగుండం: నిత్యం 40 ఎంఎల్‌డీలకుపైగా మురుగునీరు, ఓ పరిశ్రమ వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. ధర్మపురి, మంథని పట్టణాలు, తీర గ్రామాల నుంచి మరో 40 ఎంఎల్‌డీల మురుగు వచ్చిచేరుతోంది.

మంచిర్యాల: 18 ఏళ్లక్రితం నిర్మించిన ఎస్టీపీలు నిర్వహణలేక నిరుపయోగంగా మారాయి. పట్టణంలో మురుగునీరు రాళ్లవాగులోకి అక్కడి నుంచి గోదావరిలోకి చేరుతోంది.
గౌడిచర్ల: పటాన్‌చెరు పరిశ్రమల కాలుష్య జలాల్ని తీసుకువచ్చే నక్కవాగు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గౌడిచర్ల వద్ద మంజీరలో కలుస్తుంది. బచ్చులగూడెం వద్ద బాగా కలుషితం అవుతోంది.
భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని మురుగునీరంతా ఆరు కాలువల నుంచి గోదావరిలో కలుస్తోంది. శుద్ధికేంద్రం లేదు.
బూర్గంపాడు: మండలంలోని సారపాకలో ఓ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయన జలాలు గోదావరిలో చేరుతున్నాయి.

మురుగునీరు ముంచేస్తోంది

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 50కిపైగా నాలాల నుంచి మురుగునీరు వస్తోంది. రోజుకు 249 ఎంఎల్‌డీల నీళ్లు వాడుతుంటే అందులో 199 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేయకుండానే నదిలో చేరుతోంది. ఈ పరిస్థితి ఉపనదుల్లో మరింత ఎక్కువగా ఉంది. ఈ నది పరీవాహకంలో రోజూ 10 ఎంఎల్‌డీలకుపైగా మురుగునీటిని ఉత్పత్తిచేసే పట్టణాలు, ప్రాంతాలు ఆరు ఉన్నాయి.

* మంచిర్యాల 25.02 ఎంఎల్‌డీలు, సింగారెడ్డిపల్లె 25.2, బూర్గంపాడు 16.92, బోర్నపల్లి 16.83, తంగిని 16.8, కోటిలింగాల నుంచి 11.59 ఎంఎల్‌డీల మురుగునీరు గోదావరిలోకి వెళుతోంది.

* కొన్నిచోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని ఏర్పాటుచేసినా నిర్వహణ సమస్యలతో పనిచేయట్లేదు. రామగుండంలో 18 ఎంఎల్‌డీ, మంచిర్యాలలో 6.5, భద్రాచలంలో 2 ఎంఎల్‌డీల సామర్థ్యల గల మురుగునీటి శుద్ధి కేంద్రాలు పనిచేయట్లేదు. బాసర, ధర్మపురి, నిర్మల్‌, లక్షెట్టిపేట, మంథని, సారపాక వంటిచోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థేలేదు. ఎస్టీపీలూ లేవు.

నదులు, ఉపనదుల్లో కాలుష్య తీవ్రత

నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ (డీఓ) పరిమాణం నదుల్లో క్రమక్రమంగా తగ్గుతోంది. లీటరు నీటిలో  డీఓ పరిమాణం కనీసం 4 మిల్లీగ్రాములుండాలి. బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) 3 మిల్లీగ్రాములు దాటితే ప్రమాదకరం. ఉప నదుల్లో 4-9 మిల్లీగ్రాముల వరకు వెళుతోంది. గోదావరిలో వార్షిక సగటు 3 లోపే ఉంటున్నట్లు కనిపిస్తున్నా.. కొన్నినెలల్లో ఐదు వరకు వెళుతోంది.


నానాటికీ దిగజారుతూ...

కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం 2021 వార్షిక సగటు (జనవరి-జులై)లో నీటి నాణ్యత గోదావరి, మంజీర, కిన్నెరసాని నదులలో ‘బి’ గ్రేడ్‌లో, మానేరు ‘సి’ గ్రేడ్‌లో ఉంది. రామగుండం వద్ద గోదావరి ‘సి’ గ్రేడ్‌లో ఉంది. కరీంనగర్‌ మున్సిపల్‌ డంపింగ్‌ కేంద్రం దగ్గర మానేరులో జలనాణ్యత ‘డి’ గ్రేడ్‌కు పడిపోయింది.  


ఇలాగైతే ఎలా...?

ఎ గ్రేడ్‌ : బ్యాక్టిరియాను తొలగించి మంచినీళ్లుగా తాగొచ్చు
బి గ్రేడ్‌ : తాగడానికి పనికిరావు. స్నానం చేయొచ్చు
సి గ్రేడ్‌ : శుద్ధి చేస్తే తప్ప తాగకూడదు
డి గ్రేడ్‌ : జంతువులు, చేపలకే పనికొస్తాయి
ఇ గ్రేడ్‌ : వ్యవసాయ అవసరాలకే
ఇ గ్రేడ్‌ దాటితే : ఎందుకూ పనికిరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని