ఉప్పుడు బియ్యం కొనకపోతే బంగాళాఖాతంలో పారబోయాలా?

కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనొద్దని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఒడిశా, తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ రాజ్యసభాపక్ష నేత ప్రసన్నాచార్య కేంద్ర ప్రభుత్వాన్ని

Published : 04 Dec 2021 05:18 IST

కేంద్రానికి బిజూ జనతాదళ్‌ సభ్యుడి ప్రశ్న
తెలంగాణ, ఒడిశాలో పండే మొత్తం బియ్యం కొనాలని డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనొద్దని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఒడిశా, తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ రాజ్యసభాపక్ష నేత ప్రసన్నాచార్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో దీని గురించి మాట్లాడారు. ‘‘ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రైతుల సమస్య ఇది. తెలంగాణ తరహాలో ఒడిశా కూడా అధికంగా ధాన్యం పండే రాష్ట్రమే. ఒడిశా, తెలంగాణ ప్రజలు సాధారణంగా ఉప్పుడు బియ్యం వినియోగిస్తారు. అందువల్ల సహజంగానే ఏళ్ల తరబడి ఉప్పుడు బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. ఈసారి ఒడిశాలో దాదాపు 28 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మిగిలాయి. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా మిగులు బియ్యమంతా సేకరించేది. దురదృష్టవశాత్తు కేంద్రం ఒక్క గింజ కూడా ఉప్పుడు బియ్యం కొనొద్దని ఉత్తర్వులు జారీచేసింది.  ఇప్పటికే సమస్యల్లో ఉన్న రైతులకు ఇది మరో సమస్యను తెచ్చిపెట్టింది. రైతుల నుంచి ఉప్పుడు బియ్యం కొనకపోతే మేం ఆ మిగులు బియ్యాన్నంతా బంగాళా ఖాతంలో పారబోయాలా? ఇది రైతులను తీవ్రంగా  దెబ్బతీస్తోంది. కేంద్రం తక్షణం తన ఉత్తర్వులను వెనక్కు తీసుకుని ఉప్పుడు బియ్యం కొనాలి. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఒడిశా, తెలంగాణ, ఇతర రాష్ట్రాల రైతులను ఆదుకోవాలి’’ అని కోరారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని వ్యవసాయమంత్రి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని