Updated : 28 Jan 2022 05:32 IST

TRS: 40 మందితో తెరాస రాష్ట్ర కమిటీ!

ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు చోటు
రాష్ట్ర, జాతీయ అవసరాల కోణంలో ఎంపిక
అధినేత కేసీఆర్‌ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస రాష్ట్ర కమిటీపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు చేపట్టారు. 40 మందితో కొత్త కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిసింది. 15 మంది వరకు ప్రధాన కార్యదర్శులు, 25 మందిని కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా నియమించనున్నారని సమాచారం. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలకూ ఉపయోగపడే వారిపై దృష్టి సారిస్తున్నారు. వారం, పదిరోజుల్లో పేర్లు ప్రకటించే వీలుంది. తెరాస ప్రస్తుత రాష్ట్ర కమిటీ 67 మందితో ఉంది. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సంయుక్త కార్యదర్శులున్నారు. వచ్చే సంవత్సరం చివర్లో జరిగే శాసనసభ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనువుగా కొత్త కమిటీని ఆయన ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత కమిటీలో సగం మంది పనితీరుపై కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అసంతృప్తితో ఉన్నారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణ మొదలుకొని...ఇతరత్రా పార్టీ అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వర్తించడంలేదని వారు గుర్తించారు. కొందరు పదవిని అలంకార ప్రాయంగానూ, సొంత అవసరాలకు వాడుకున్నారని, వారివారి సామాజిక వర్గాలలోనూ పట్టు లేదని తేలింది. ఉప ఎన్నికలలో విధులను అప్పగించగా...దానిని వదిలేసి, హైదరాబాద్‌లో తిష్ఠవేశారని తెలిసింది. కొంత మంది టీవీ చర్చలకే పరిమితం కాగా... మరికొందరు తెలంగాణభవన్‌లో సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. కొందరికి నియమిత పదవులు ఇచ్చినా... దానిని స్వప్రయోజనాలకే వాడుకున్నారని గమనించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా పలువురు సరిగా పనిచేయకపోవడంతో అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసం కొందరిని నియమించగా...వారు ప్రచారం మాని...హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీకి రావడం చూసి అందరూ విస్మయం చెందారు. కొందరి పనితీరు నచ్చక వారిని పార్టీ బాధ్యతల నుంచి తొలగించి, ఇతరులకు అధిష్ఠానం అప్పగించింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కమిటీలోని పలువురిని తొలగించి, కొత్త వారిని నియమించనున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు చోటు
పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల్లో ఏకంగా 19 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అవకాశం కల్పించారు. రాష్ట్ర కమిటీలో కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలకు చోటు దక్కనుంది. ఎలాంటి వివాదాలు, అభియోగాలు లేని, అంకితభావంతో పూర్తిస్థాయిలో పనిచేస్తూ...నియమిత పదవులను ఆశించని నేతలను తీసుకోనున్నారు. ఆంగ్లం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారిని ఎంచుకోనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై సీఎం గురువారం కొందరు నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురి  పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్ర కమిటీ నియామకానికి ముందు అన్ని జిల్లాల మంత్రులతో సీఎం కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌  చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌తో మంత్రులు, తెరాస జిల్లా అధ్యక్షుల భేటీ  
ఈనాడు, హైదరాబాద్‌: తెరాస జిల్లాల కొత్త అధ్యక్షులు గురువారం మంత్రుల నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డిలతో జిల్లా అధ్యక్షులైన పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), చింతా ప్రభాకర్‌ (సంగారెడ్డి), మెతుకు ఆనంద్‌ (వికారాబాద్‌), జీవీ రామకృష్ణారావు (కరీంనగర్‌), కె.విద్యాసాగర్‌రావు (జగిత్యాల), కోరుకంటి చందర్‌ (పెద్దపల్లి), మాగంటి గోపీనాథ్‌ (హైదరాబాద్‌), శంభీపూర్‌ రాజు (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (రంగారెడ్డి), కుసుమ జగదీశ్‌ (ములుగు), పి.సంపత్‌రెడ్డి (జనగామ), గండ్ర జ్యోతి (జయశంకర్‌ భూపాలపల్లి), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్‌), ఎస్‌.రాజేందర్‌రెడ్డి (నారాయణపేట). జి.కృష్ణమోహన్‌రెడ్డి (జోగులాంబ గద్వాల), కోనేరు కోనప్ప (కుమురం భీం అసిఫాబాద్‌)లు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారి వెంట ఉన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని