జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు విద్యుత్‌ బస్సులు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్‌ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.

Published : 26 Apr 2024 04:04 IST

మొత్తం వెయ్యికిపైగా.. జులై కల్లా 450 అందుబాటులోకి
ప్రధాన బస్టాండ్లు, డిపోల్లో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్‌ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో జులై కల్లా 450 అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్‌ బస్సుల్లో పది మాత్రమే దూరప్రాంత సర్వీసులు కాగా, మిగిలినవి హైదరాబాద్‌ సిటీలో తిరుగుతున్నాయి. కొత్తగా నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అదేవిధంగా జిల్లాల్లో ఇతర ప్రాంతాలకు వీటిని నడిపించేలా ఆర్టీసీ కార్యాచరణకు సిద్ధమవుతోంది.

కాలుష్య ఉద్గారాలు ‘సున్నా’..

ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఇంధన వ్యయం తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. వీటి నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు సున్నా. ఇవి తిరిగేందుకు కావాల్సిన విద్యుత్‌ కోసం ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు తొలుత పెద్దమొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులున్నాయి. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌, మియాపూర్‌ బస్‌డిపోల్లో.. అదేవిధంగా హైదరాబాద్‌-విజయవాడ రూట్లో సూర్యాపేటలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. నగరంలో పలు బస్‌డిపోలు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను ఆర్టీసీ ప్రారంభించింది.

ఒక్కో ఛార్జింగ్‌ స్టేషన్‌కు రూ.3-5 కోట్లు

బీహెచ్‌ఈఎల్‌ బస్‌ డిపోలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత హెచ్‌సీయూ డిపోలో పనులు మొదలుకానున్నాయి. ఒక్కో డిపోలో బస్సులు భారీ సంఖ్యలో ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ‘ఫాస్ట్‌ ఛార్జింగ్‌’కు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం 33 కేవీ హైటెన్షన్‌ లైన్ల నుంచి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుచేసే చోట సబ్‌స్టేషన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైటెన్షన్‌ లైన్‌ దూరాన్ని బట్టి ఒక్కో దానికి రూ.3-5 కోట్ల వరకు ఖర్చవుతోందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు హయత్‌నగర్‌ బస్‌డిపో వద్దకు 3 కి.మీ. దూరం నుంచి హైటెన్షన్‌ లైన్‌ వేస్తున్నారు. ఇక్కడ ఛార్జింగ్‌ స్టేషన్‌కు దాదాపు రూ.4.5 కోట్లు ఖర్చవుతోంది. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండలోనూ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. కరీంనగర్‌ నిజామాబాద్‌ జిల్లాల బస్సులు సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ మీదుగా హైదరాబాద్‌లో ఎంజీబీఎస్‌కు వెళ్లివస్తాయి. ఈ నేపథ్యంలో జేబీఎస్‌లోనూ.. అక్కడి కంటోన్మెంట్‌ డిపో పక్కన ఖాళీ స్థలంలో కూడా ఛార్జింగ్‌ స్టేషన్‌కు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏసీ ఎలక్ట్రిక్‌లో.. ఈ-గరుడ, పుష్పక్‌ రకాల బస్సులు, నాన్‌ఏసీలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌లు తిరుగుతున్నాయి. కొత్తగా వచ్చే విద్యుత్‌ బస్సుల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌లో కొత్త పేరుతో.. అదేవిధంగా ఏసీలో ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని