ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌ కార్యాలయానికి..

భారాస నుంచి ఎన్నికైన స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది.

Updated : 26 Apr 2024 04:49 IST

కడియం, తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్‌లపై వివేకానంద్‌ న్యాయవాదికి హైకోర్టు సూచన
విచారణ 29కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: భారాస నుంచి ఎన్నికైన స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. ఈ పిటిషన్‌ కాపీలను స్పీకర్‌ కార్యాలయానికి పంపి ధ్రువీకరించాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. కడియం శ్రీహరి, వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారని.. వారిపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌లను స్పీకర్‌ స్వీకరించడం లేదని పేర్కొంటూ భారాస కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దానిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు పూర్వాపరాలను వినిపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి... ‘అనర్హత పిటిషన్‌లు స్పీకర్‌కు ఇంకా అందలేదని ఎలా ఉత్తర్వులు జారీ చేయాలి? వాటిని ప్రభుత్వ న్యాయవాది ద్వారా పంపేలా ఆదేశాలు జారీ చేస్తాం’ అని అన్నారు.

అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఉత్తర్వులు అవసరంలేదని, కాపీలను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌ కార్యాలయానికి అందే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. దానికి న్యాయమూర్తి అనుమతించారు. విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు. అలాగే భారాస తరఫున ఖైరతాబాద్‌ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటుకు సంబంధించి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘‘సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున దానం నాగేందర్‌ పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్‌ జారీ చేసిన బీ-ఫాంతోపాటు అదనపు అఫిడవిట్‌ను స్పీకర్‌కు అందజేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి’’ అని వివరించారు. వాటిని కూడా ప్రభుత్వ న్యాయవాది ద్వారా పంపాలని న్యాయమూర్తి సూచించారు. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వ న్యాయవాది బి.మోహనారెడ్డి వాటిని స్వీకరించారు. ఆమె వాటిని స్పీకర్‌ కార్యాలయానికి పంపి సోమవారం వివరాలను న్యాయస్థానానికి తెలియజేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని