CT Scan: సీటీ.. లేదేమిటి?

కరోనా ఉరుముతున్న వేళ అత్యంత ప్రధాన ఆసుపత్రుల్లోనూ సీటీ స్కానింగ్‌్ సౌకర్యం లేకపోవడం పెద్దలోటుగా నిలుస్తోంది. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు సీటీ స్కాన్‌ పరికరాలనే అందుబాటులో ఉంచలేదు.

Updated : 14 Oct 2023 00:20 IST

ఈఎన్‌టీ, ఛాతీ ఆసుపత్రుల్లో అందుబాటులో లేని సీటీ స్కానింగ్‌
ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరవైన సౌకర్యం
కొవిడ్‌, ఫంగస్‌ వ్యాధుల్లో ఇదే కీలకం

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి, గచ్చిబౌలి టిమ్స్‌... ఇవన్నీ కరోనా వ్యాధి నేపథ్యంలో అతి ముఖ్యమైన ఆసుపత్రులు. వందలాది మంది రోగులకు ఇక్కడ వైద్యం చేస్తున్నారు. కానీ వీటిలో సీటీ స్కానింగ్‌ సదుపాయం లేదు.
కరోనా సోకినవారికి ఊపిరితిత్తుల స్కానింగ్‌ ఎంత ముఖ్యమో తెలిసిందే. పలు రకాల ఇన్ఫెక్షన్లను అంచనా వేయడానికి, శరీరంలో అంతర్గతంగా ఉన్న సమస్యలు తెలుసుకోడానికి ఇది అత్యవసరం. ఇంత ముఖ్యమైన సౌకర్యం లేకపోవడంతో స్కానింగ్‌ అత్యవసరమైన స్థితిలో రోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో 670 పడకలున్నాయి. ప్రస్తుతం 216 పడకల్లో కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌లోనే కాదు.. ఏ ఛాతీ వ్యాధుల్లోనైనా ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ అవసరం చాలా ఎక్కువ. అతి ముఖ్యమైన ఆ సౌకర్యం ఇప్పటివరకూ ఇక్కడ లేదు. 

ఈనాడు - హైదరాబాద్‌

కరోనా ఉరుముతున్న వేళ అత్యంత ప్రధాన ఆసుపత్రుల్లోనూ సీటీ స్కానింగ్‌్ సౌకర్యం లేకపోవడం పెద్దలోటుగా నిలుస్తోంది. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు సీటీ స్కాన్‌ పరికరాలనే అందుబాటులో ఉంచలేదు. ముఖ్యమైన ఆసుపత్రులు, జిల్లా దవాఖానాల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ప్రాంతీయ ఆసుపత్రుల సంగతి సరేసరి. కొవిడ్‌ నేపధ్యంలో గత ఏడాదిగా స్కానింగ్‌ అవసరాలు బాగా పెరిగిపోయాయని వైద్యవర్గాలకు కూడా తెలుసు. ఇప్పుడు ఫంగస్‌ వ్యాధులు కూడా దాడి చేస్తున్నాయి. ఈ సమయంలో సీటీ స్కాన్‌ చేయించకుండా చికిత్స ముందుకు కదిలే పరిస్థితి లేదు. అయినా సరే ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిజానికి ఆ పరికరాల ఖర్చు రూ.వందల కోట్లయ్యేది కూడా కాదు. ఒక్కో యంత్రం విలువ రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో నెలకొల్పినా రూ.100 కోట్ల ఖర్చు దాటదు. ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణలో భాగంగా రూ.వేల కోట్లు ఖర్చుపెట్టడానికి అనుమతులు ఇస్తుంటే.. ఉన్నతాధికారులు మాత్రం అతి ముఖ్యమైన వైద్య పరికరాల కొనుగోలుపై దృష్టిసారించడం లేదు. దీని వల్ల రోగులకు నరకం కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడకు వెళ్లాలో తెలియక వారు అవస్థలు పడుతున్నారు.

శతకోఠి సమస్యలు...
ఈఎన్‌టీ వైద్యుడి వద్దకు వచ్చే రోగుల్లో సగం మందికి పైగా సైనస్‌ సంబంధిత సమస్యల వారే. వీరిలో ఇన్‌ఫెక్షన్‌ అంచనా వేయడానికి ఈఎన్‌టీ వైద్యులు తప్పనిసరిగా సాయం తీసుకునే పరీక్ష సీటీ స్కాన్‌. దీని ద్వారా ఎంత తీవ్రత ఉంది? ఆపరేషన్‌ అవసరమా? అనేది నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆస్పార్‌జిల్లస్‌, మ్యూకర్‌ మైకోసిస్‌, క్యాండిడా తదితర ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లను అంచనా వేయడానికి కూడా స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇంత అత్యవసరమైన సీటీ స్కాన్‌ యంత్రం కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో లేదు. ఇక్కడ స్కానింగ్‌ అవసరమైన వారు ప్రైవేటుకు వెళ్లి రూ.వేలు కుమ్మరించడమో.. లేదా ఉస్మానియాకు వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సి రావడమో.. ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సి వస్తోంది. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రికి నిత్యం సుమారు 1500 పైగానే ఓపీ ఉంటుంది. ఇంతమందిలో కనీసం 30-40 శాతం మందికి సీటీ స్కాన్‌ ఆవసరమైనా.. 450-600 మంది అవస్థలు పడాల్సిందే. పైగా ఇక్కడ నిత్యం 20-25 వరకూ ఈఎన్‌టీ సర్జరీలు జరుగుతుంటాయి. వీరికి సీటీ స్కాన్‌ అవసరమైనా తిప్పలు తప్పవు.

ఎక్కడ చూసినా...
* నిలోఫర్‌ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ యంత్రముంది. కానీ చాన్నాళ్ల క్రితంది కావడంతో పదేపదే మొరాయిస్తోంది. ఇరవై రోజుల క్రితం పాడైన దాన్ని ఇప్పటికీ బాగు చేయించకపోవడంతో ఇక్కడి చిన్నారులకు సీటీ స్కాన్‌ చేయించాల్సి వస్తే ఉస్మానియాకో, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికో పంపిస్తున్నారు. ఎంత అత్యవసరమైనా స్కానింగ్‌ కోసం కనీసం మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే. లేదంటే ప్రైవేటు ల్యాబ్‌కు పోయి సుమారు రూ.3వేలు చెల్లించి తీయించుకోవాల్సి వస్తోంది.
* దాదాపు 600 మందికి పైగా కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్న టిమ్స్‌లోనూ సీటీ స్కాన్‌ సౌకర్యం లేదు. ఎవరికి ఛాతీ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైందని భావించినా.. నిర్ధారించాలంటే అందుబాటులో స్కానింగ్‌ సౌకర్యం లేకపోవడం తీర్చలేని లోటుగా పరిణమించింది. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అయితే రెండేళ్లుగా సీటీ స్కాన్‌ యంత్రం మూలకు పడినా పట్టించుకునే వారే లేరు. దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. ఎక్కడా ఈ సౌకర్యం లేకపోవడం శోచనీయమే.

త్వరలో 9 చోట్ల...
రాష్ట్రంలో 9 ఆసుపత్రుల్లో కొత్తగా సీటీ స్కాన్‌ పరికరాలను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇటీవలే కొత్తగా సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఇంకా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, టిమ్స్‌, నల్గొండ, సంగారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రి గానీ, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి గానీ లేకపోవడం గమనార్హం.

కొవిడ్‌లోనే కాదు.. ఇతరత్రా కూడా సీటీ కీలకమే
-డాక్టర్‌ సుమన్‌చంద్ర, విశ్రాంత ఆచార్యులు, రేడియాలజీ విభాగం, ఉస్మానియా వైద్య కళాశాల

కొవిడ్‌లోనే కాదు.. ఇంకా అనేక చికిత్సల్లో సీటీ స్కాన్‌ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెదడులో తీవ్రత ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. శరీరంలో కణతులు గుర్తించడానికి కూడా సీటీ స్కాన్‌ అవసరం. సాధారణ ఛాతీ ఇన్‌ఫెక్షన్లు, సైనస్‌లలో కూడా సీటీ స్కాన్‌ చాలా అవసరం. సాధారణంగా ఛాతీలో గాలితో నిండి ఉంటుంది. అలా కాకుండా రక్తంతో గానీ, నీటితో గానీ నిండితే అప్పుడు వ్యత్యాసం సీటీలో తెలిసిపోతుంది. ఇప్పడు అత్యాధునిక సీటీస్కాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఒకేసారి ఎక్కువ ప్రాంతాలను గుర్తించడం వల్ల రోగిపై రేడియేషన్‌ ప్రభావం తక్కువగా పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని