Pranahita Pushkaralu: పుష్కరాలకు వేళాయె

ప్రాణహిత పుష్కరాలు రానే వచ్చాయి. బుధవారం నుంచి 24వ తేదీ వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు.    మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట పుష్కర ఘాట్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు దేవాదాయశాఖ

Updated : 13 Apr 2022 04:44 IST

నేటి మధ్యాహ్నం ప్రారంభం
ప్రాణహిత ఘాట్ల వద్ద ఏర్పాట్లు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కాళేశ్వరం, కోటపల్లి: ప్రాణహిత పుష్కరాలు రానే వచ్చాయి. బుధవారం నుంచి 24వ తేదీ వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు.    మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట పుష్కర ఘాట్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కిందటిసారి 2010 డిసెంబరులో నిర్వహించగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కర కళ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో రోజూ 2లక్షల మంది  స్నానాలు ఆచరిస్తారని అంచనా. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలో అర్జునగుట్ట వద్ద, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద, మహారాష్ట్రలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరఘాట్లను సిద్ధం చేశారు.

* తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్‌కు మరమ్మతులు పూర్తిచేశారు. పార్కింగ్‌ స్థలం వద్ద బారికేడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పిండప్రదానాల కోసం షెడ్లు, దుస్తులు మార్చుకునే గదులను సిద్ధం చేశారు.

* అర్జునగుట్ట వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, శ్రాద్ధ మండపాలు, కేశఖండన శాలలు, నదిలో ప్రమాదాలు జరగకుండా కంచె, చెన్నూరు నుంచి 20 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర వంతెన నుంచి అర్జునగుట్ట పుష్కరఘాట్‌ వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ భారతి హోళ్లికేరి మంగళవారం పరిశీలించారు.

* కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద రెండు పుష్కరఘాట్లు సిద్ధం చేశారు. చలువపందిళ్లు, తాగునీరు, విద్యుత్తు, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు. 36 షవర్లు, దుస్తులు మార్చుకునేందుకు రెండు షెడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, మూడు చోట్ల పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన మీదుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని సిరోంచకు వెళ్లేందుకు 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి సతీమణి దుర్గ స్టాలిన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు రవిశంకర్‌ గురూజీ, కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి తదితరులు పుష్కరాలకు రానున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని