Essentials: సామాన్యుడికి ధరదడ

ఒకవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. మరోవైపు పెట్రో మంటతో ఇప్పటికే సామాన్య పేద కుటుంబాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తాజాగా పామాయిల్‌ ఎగుమతులను నిలిపివేస్తున్నామన్న ఇండోనేసియా ప్రకటనతో వంటనూనెల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒకదానికొకటి తోడై అన్నింటి రేట్లు పెరిగి ధరలు ఉత్పాతంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బతుకు మూలిగేనక్కపై తాటికాయపడిన చందంగా తయారైంది. యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల

Updated : 25 Apr 2022 05:59 IST

పామాయిల్‌ ఎగుమతులను నిలిపివేస్తున్నామన్న ఇండోనేసియా
సలసల కాగుతున్న వంట నూనెలు
యుద్ధం నుంచి కోలుకుంటున్న మార్కెట్‌పై పిడుగు
మరోవైపు పెట్రో మంటతో అంతటా ధరల జ్వాలలు
విలవిల్లాడుతున్న ప్రజలు
ఈనాడు - హైదరాబాద్‌

కవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. మరోవైపు పెట్రో మంటతో ఇప్పటికే సామాన్య పేద కుటుంబాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తాజాగా పామాయిల్‌ ఎగుమతులను నిలిపివేస్తున్నామన్న ఇండోనేసియా ప్రకటనతో వంటనూనెల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒకదానికొకటి తోడై అన్నింటి రేట్లు పెరిగి ధరలు ఉత్పాతంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బతుకు మూలిగేనక్కపై తాటికాయపడిన చందంగా తయారైంది. యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు పక్షం రోజుల నుంచి కొంత తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఈ నెల 28 నుంచి పామాయిల్‌ ఎగుమతులు నిలిపివేస్తున్నట్లు ఇండోనేసియా ప్రకటించడంతో నూనెల ధరలు మళ్లీ రాజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టోకు వ్యాపారులు పామాయిల్‌ విక్రయాలను నిలిపివేశారు. ఈ ప్రభావం అన్ని వంటనూనెల ధరలపై నేరుగా పడింది. వారం క్రితం లీటరు పామాయిల్‌ ధర రూ.140కి చేరగా ఇప్పుడు రూ.150.. రేపో, మాపో రూ.160 అయ్యే అవకాశం ఉంది. ‘విజయ’ బ్రాండు పొద్దుతిరుగుడు నూనె లీటరు ధర గత నెల ఒకటిన రూ.167 కాగా తాజాగా రైతుబజార్లలో (రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య - ఆయిల్‌ఫెడ్‌) రూ.190కి చేరింది. చిల్లర మార్కెట్లలో ఇప్పటికే లీటరు రూ.200కి అమ్ముతున్నారు. తెలంగాణలో వినియోగించే వంటనూనెల్లో పామాయిల్‌ అమ్మకాలే 60 శాతానికి పైగా ఉండటంతో దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంది.

రవాణా వ్యయం మంటతో...

ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌ ధరల మంట కారణంగా వంటనూనెలు, కూరగాయలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలన్నీ పెరుగుతున్నాయని హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌కు చెందిన టోకు వ్యాపారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. గత ఏడాది వ్యవధిలో పెట్రోలు ధర లీటరుకు రూ.25కు పైగా, డీజిల్‌ ధర రూ. 17కు పైగా పెరగడంతో అదే నిష్పత్తిలో లారీలు, వ్యాన్ల యజమానులు రవాణా ఛార్జీలు పెంచేశారని ఆయన చెప్పారు.

ఉల్లిగడ్డలు రోజూ మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక మార్కెట్లకు వస్తుంటాయి. ఈ ఏడాది వ్యవధిలో లారీలోడు కిరాయి గత ఏడాది కన్నా రూ.3-4 వేలు అదనంగా పెంచేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌పండ్ల మార్కెట్‌ను కొత్తపేట నుంచి నగరశివారులోని బాటసింగారానికి తరలించారు. ఇక్కడ పండ్లు కొన్న చిల్లర వ్యాపారులు చందానగర్‌, లింగంపల్లి, కొంపల్లి వంటి ప్రాంతాలకు రానుపోను 100-120 కిలోమీటర్ల రవాణా వ్యయం భరించాల్సి వస్తుండడంతో.. ఆ మేర పండ్ల ధరలను పెంచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలో మామిడికాయలు రూ.100, అమెరికన్‌ నల్లద్రాక్షలను రూ.150కి పైగా విక్రయిస్తున్నారు. మలక్‌పేట టోకు మార్కెట్‌ నుంచి తిరిగి తెలంగాణ జిల్లాల్లోని మార్కెట్లకు వెళ్లడానికి కిరాయిలు మరింతఅదనం. దీంతో పప్పులు, వంటనూనెలు, కూరగాయలు ..ఇలా అన్ని ధరలు పెరుగుతున్నాయి.

ఆటో, క్యాబ్‌ కిరాయిలు కూడా ఒక తడవకు రూ.20-40 దాకా పెంచేశారు. ‘ఇంతకుముందు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కూకట్‌పల్లికి రూ.150 కిరాయికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు రూ.200-220 దాకా వసూలు చేస్తున్న’ట్లు ఆటోడ్రైవర్‌ రమేశ్‌ చెప్పారు.

సరిగ్గా ఏడాది క్రితం 2021 ఏప్రిల్‌ 24న లీటరు పెట్రోలు ధర రూ.94.13 ఉంటే ఇప్పుడు రూ.119.49కి చేరింది. ఇలాగే డీజిల్‌ ధర రూ.88.18 నుంచి 105.49కి చేరింది.

గత ఏడాది ఇదే సమయంలో కందిపప్పు, మినప్పప్పు, సెనగపప్పు వంటి వాటి ధర కిలో రూ.100-140 ఉంటే ఇప్పుడు ప్రాంతాలను బట్టి రూ.120-160 దాకా వసూలు చేస్తున్నారు.

దేశంలో మినుముల దిగుబడి బాగా తగ్గినందున ఏడాదికాలంలో మినపగుండ్లు, మినప్పప్పు ధర చిల్లర మార్కెట్‌లో కిలోకు రూ.20-30 దాకా పెంచేశారు.

పెట్రో ధరల పెరుగుదల వల్ల క్యాబ్‌లో వెళ్లే సమయంలో ఏసీ ఆన్‌ చేయడం లేదని, ఎవరైనా ఏసీ అడిగితే కిరాయిపై అదనంగా రూ.10-20 వసూలు చేస్తున్నట్లు క్యాబ్‌ డ్రైవర్‌ యాసీన్‌ తెలిపారు.

నలుగురు సభ్యులున్న సామాన్య కుటుంబానికి సగటున నెలకు అదనపు ఖర్చు.. (అంచనాలు రూపాయల్లో)
వంటనూనె : 150
పప్పులు : 75
కూరగాయలు: 100
ఆటో, క్యాబ్‌ లేదా పెట్రోలు: 300
ఇతర నిత్యావసరాలు: 300

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని