Updated : 25 Jun 2022 05:32 IST

Presidential Election: అట్టహాసంగా ద్రౌపది నామినేషన్‌

రాష్ట్రపతి ఎన్నికకు పత్రాల సమర్పణ
ప్రతిపాదించిన ప్రధాని మోదీ
బలపరిచిన కేంద్ర మంత్రులు

ఈనాడు, దిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం అట్టహాసంగా నామినేషన్‌దాఖలు చేశారు. మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రధాని చేతులమీదుగా ఆమె పత్రాలను రిటర్నింగ్‌ అధికారి (రాజ్యసభ సెక్రటరీ జనరల్‌) పి.సి.మోదీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎన్నికను కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నామినేషన్ల సమయంలోనే ప్రత్యర్థులకు తన సంఖ్యాబలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పార్లమెంటు ప్రాంగణం సందడిగా మారింది.

దిల్లీలోని ఒడిశా భవన్‌లో బస చేసిన ద్రౌపది.. ఉదయం అక్కడి నుంచి పార్లమెంటుకు బయలుదేరడానికి ముందు ప్రతిపక్ష నేతలు సోనియా గాంధీ, మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌లకు ఫోన్‌చేసి తనకు మద్దతు ఇవ్వాలని, నామినేషన్‌ కార్యక్రమంలోనూ పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం పార్లమెంటు భవనానికి వచ్చి మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌, బిర్సా ముండా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి పార్లమెంటు లైబ్రరీ భవనానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఇతర ముఖ్యనేతలు వెంట వచ్చారు. అప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసి ఉంచారు. వీటిపై ప్రతిపాదకులు, సమర్థకులతో కలిసి 500 మందికిపైగా ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు.

మొదటి సెట్‌పై ప్రధానమంత్రి తొలి సంతకం చేసి ఆమె పేరును ప్రతిపాదించగా, రాజ్‌నాథ్‌ సింగ్‌ రెండో సంతకం చేసి బలపరిచారు. తర్వాత కేంద్ర మంత్రులంతా ప్రతిపాదకులు, సమర్థకుల జాబితాలో సంతకాలు చేశారు.

రెండో సెట్‌లో భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తొలి సంతకం చేయగా, భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు.

మూడో సెట్‌పై హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు తొలి, మలి సంతకాలు చేయగా, ఆ రాష్ట్రాల ఎంపీలు, శాసనసభ్యులు మిగతా సంతకాలు చేశారు.

నాలుగో సెట్‌పై గుజరాత్‌ సీఎం, ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, శాసనసభ్యులు సంతకాలు చేశారు.

ర్యాలీగా..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.09 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనానికి వచ్చి ద్రౌపదితో భేటీ అయ్యారు. 12.30 గంటలకు అందరూ ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి, నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేడీ, జేడీయూ, అన్నా డీఎంకే, వైకాపా నేతలు పాలుపంచుకున్నారు. 2017లో రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ కార్యక్రమంలో భాజపా అగ్రనేతలు ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీ పాల్గొనగా ఈసారి వారు కనిపించలేదు. జులై 18లోపు ఓటర్లందర్నీ కలిసి మద్దతు కోరుతానని ద్రౌపది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వైకాపా నేతల సంతకాలు

ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ పత్రాలపై వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభ ఎంపీ మిథున్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంతకాలు చేశారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వీరితోపాటు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భాజపా తరఫున ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పాలుపంచుకున్నారు.

ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), బసవరాజ్‌ బొమ్మై (కర్ణాటక), భూపేంద్ర పటేల్‌ (గుజరాత్‌), హిమంత బిశ్వశర్మ (అస్సాం), పుష్కర్‌సింగ్‌ధామి (ఉత్తరాఖండ్‌), జయరాం ఠాకూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), మనోహర్‌లాల్‌ కట్టర్‌ (హరియాణా), పెమా ఖండూ (అరుణాచల్‌ ప్రదేశ్‌), ప్రమోద్‌ సావంత్‌ (గోవా), బీరేన్‌ సింగ్‌ (మణిపుర్‌), కర్నాడ్‌ సంగ్మా (మేఘాలయ)లు నామపత్రాలపై సంతకాలు చేశారు.  


60%కిపైగా ఓట్లు వస్తాయని మంత్రుల ధీమా

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు 60%కిపైగా ఓట్లు వస్తాయని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు, బయటినుంచి బీజేడీ, వైకాపా, ఇతర పార్టీలూ మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని దాటడం ఖాయమన్నారు. దేశంలో తొలిసారి గిరిజన మహిళను అత్యున్నత రాష్ట్రపతి పదవికి పోటీకి నిలబెట్టిన నేపథ్యంలో విభిన్న పార్టీల్లోని బలహీనవర్గాల ఎంపీలూ ఆమెకు మద్దతిచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎన్నిక రహస్య ఓటింగ్‌ ప్రాతిపదికన జరగనున్నందున వారు తమ మనస్సాక్షి ప్రకారం ఓటేసే వీలుందన్నారు. ముర్ముకు మద్దతివ్వాలంటూ భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా శుక్రవారం విపక్ష పార్టీలకు చెందిన మల్లికార్జున ఖర్గే, అధీర్‌ రంజన్‌ చౌధురి, మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా తదితరులకు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు.

ముర్ముకు నివాస గృహం కేటాయింపు

ద్రౌపదీ ముర్ముకు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దిల్లీలోని పండిత్‌ ఉమాశంకర్‌ దీక్షిత్‌ మార్గ్‌లోని 4వ నంబర్‌ ఇల్లు కేటాయించింది. ప్రస్తుతం ఒడిశా భవన్‌లో ఉంటున్న ఆమె ఎన్నికయ్యేంతవరకూ ఈ ఇంట్లో ఉండటానికి అవకాశం కల్పించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 21న ఫలితం వెలువడనుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని