అటవీ అధికారులను అడ్డుకున్న రైతులు

అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్తున్న ఆ శాఖ అధికారులను రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని మెంగుబాయి గూడెం, బొందగూడ, అడ్డాఘాట్‌లో 50

Published : 28 Jun 2022 05:36 IST

8 గంటలపాటు రోడ్డుపై బైఠాయింపు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్తున్న ఆ శాఖ అధికారులను రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని మెంగుబాయి గూడెం, బొందగూడ, అడ్డాఘాట్‌లో 50 మందికి 181 ఎకరాల్లో రెవెన్యూ పట్టాలు, 30 మందికి 130 ఎకరాల్లో అటవీహక్కు పత్రాలు ఇవ్వాలని ఆయా గ్రామ రైతులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇది వరకే 165 ఎకరాలకు రెవెన్యూ పట్టాలు, 104 ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చామని, అంతకంటే ఎక్కువ సాగుచేస్తున్న భూమినే స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న అటవీ అధికారులు ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా అధికారులను రైతులు అడ్డుకుంటూ వస్తున్నారు. సోమవారం సుమారు 70 మంది అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు వెళ్తుండగా బొందగూడ వద్ద మరోసారి రైతులు అడ్డుకున్నారు. ఎడ్లబండ్లు అడ్డుగా నిలిపి దాదాపు ఎనిమిది గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పరస్పరం వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. వారికి స్థానిక కాంగ్రెస్‌ నేతలు మద్దతు తెలపడంతో అధికారులు ముందుకెళ్లలేకపోయారు. మధ్యాహ్నం తర్వాత ఎఫ్‌డీవో దినేష్‌కుమార్‌ రైతులతో చర్చించారు. తమ సాగులో ఉన్న భూములకు పట్టాలిచ్చే వరకు అడ్డుకుంటూనే ఉంటామని తేల్చిచెప్పడంతో వారంతా వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని