రేపు అల్పపీడనం

ఒడిశా ఉత్తర ప్రాంతంపై సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. బంగ్లాదేశ్‌పై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

Published : 03 Jul 2022 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒడిశా ఉత్తర ప్రాంతంపై సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. బంగ్లాదేశ్‌పై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. మధ్యప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతంపై 5.8 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా హైదరాబాద్‌ నగర పరిధిలోని బాచుపల్లిలో 4.4 సెంటీమీటర్లు, దమ్మాయిగూడలో 3.1, ఉషోదయ కాలనీలో 2.6, కంది(సంగారెడ్డి జిల్లా)లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గడంతో వాతావరణం చల్లబడింది. విద్యుత్‌ డిమాండ్‌ కూడా గణనీయంగా తగ్గింది. శనివారం రాత్రి 8 గంటలకు రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 6875 మెగావాట్లు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని