Telangana Police: టార్గెట్‌ 60..!

సమాజంలో గుర్తింపున్న ఉద్యోగం.. ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం.. యూనిఫాం కొలువు కావడంతో యువతలో క్రేజ్‌.. ఈ కారణాలే పోలీస్‌ కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అందుకే 554 ఎస్సై పోస్టులకు

Updated : 06 Aug 2022 07:24 IST

పోలీస్‌ ప్రాథమిక రాతపరీక్షలో 30 శాతంతోనే అర్హత
నెగెటివ్‌ మార్కులతో జాగ్రత్త అంటున్న టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ
రేపు ప్రిలిమినరీ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: సమాజంలో గుర్తింపున్న ఉద్యోగం.. ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం.. యూనిఫాం కొలువు కావడంతో యువతలో క్రేజ్‌.. ఈ కారణాలే పోలీస్‌ కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అందుకే 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తే ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చిపడ్డాయి. అంటే..ప్రతి పోస్టుకు 446 మంది పోటీలో ఉన్నట్లు లెక్క. ఇలాంటి ఉద్యోగాల్లో కీలకమైన ప్రాథమిక రాత పరీక్ష ఈనెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. సంబంధిత ఏర్పాట్లను రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో పరీక్షపరంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండలి సూచనలు చేసింది.

తొలిసారి అర్హత మార్కుల కుదింపు

ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించే మార్కులను తొలిసారిగా కుదించారు. క్రితంసారి పరీక్షల్లో సామాజిక వర్గాలవారీగా ఈ మార్కులుండేవి. ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 30శాతం మార్కులు సాధిస్తే పరీక్ష గట్టెక్కినట్లే. అంటే 60 ప్రశ్నలకు సరైన సమాధానాల్ని గుర్తించగలిగితే చాలు.  

మార్కుల బెంగ వద్దు.. వడపోత మాత్రమే..

సాధారణంగా పరీక్ష అనగానే ఎక్కువ మార్కులు సాధించాలనే ఆతృత ఉంటుంది. ప్రస్తుత పోలీస్‌ ప్రాథమిక రాతపరీక్ష అందుకు భిన్నం. ఇది వడపోత ప్రక్రియ మాత్రమే. దరఖాస్తుదారుల ప్రాథమిక స్థాయి పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఉద్దేశించింది. ఈ మార్కుల్ని తుది ఫలితాల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. అందుకే ఎక్కువ మార్కులు సాధించాలన్న ఒత్తిడి అవసరం లేదని మండలివర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవంక.. ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులుండటం కీలకంగా మారింది. 5 తప్పుడు సమాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించనున్నారు. అందుకే తొలుత సరైన సమాధానాలు తెలిసిన ప్రశ్నలపైనే దృష్టిపెట్టాలి. పరీక్షలో 60 సరైన జవాబులను పక్కాగా గుర్తించగలిగితే గట్టెక్కిపోవచ్చు.తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాస్తే నెగెటివ్‌ మార్కులతో మొదటికే మోసం రావచ్చు. తుది రాతపరీక్షలో మాత్రం నెగెటివ్‌ మార్కులుండవు.


నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఈనెల ఏడోతేదీన జరిగే పోలీసు రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, సూచనలను పోలీసు విభాగం శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలలోపే చేరుకోవాల న్నారు. 10 గంటలకు గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. బ్యాగులు, సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్‌ తదితరాలు వెంట ఉండకూడదన్నారు. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్‌, పెన్‌ మాత్రమే తీసుకురావాలన్నారు. హాల్‌టికెట్‌పై వివరాలన్నీ సరిచూసుకొని పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అతికించాలని, లేనిపక్షంలో పరీక్షకు అనుమతి ఉండదని తెలిపారు.  మెహందీ, టాటూ వేసుకోవద్దన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని