దస్త్రం దాటని బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు

రాష్ట్ర బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు దస్త్రాల దశ దాటలేదు. దీన్ని నాలుగు వారాల్లో ఏర్పాటు చేయాలని గతంలో న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా స్పందన కరవైంది.

Published : 20 Mar 2023 03:36 IST

న్యాయస్థానం విధించిన  గడువు దాటి 10 నెలలు
ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన కరవు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు దస్త్రాల దశ దాటలేదు. దీన్ని నాలుగు వారాల్లో ఏర్పాటు చేయాలని గతంలో న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా స్పందన కరవైంది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారులు నోటీసులు జారీ చేయడం, నిర్మాణదారులు న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఈక్రమంలో అక్రమ నిర్మాణాలకు చెక్‌ పెట్టేందుకు బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ చట్టాన్ని 2017లో ప్రభుత్వం సవరించింది. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఆ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని చట్టసవరణలో పేర్కొంది. ఇది జరిగి అయిదేళ్లయినా ఇంతవరకు అతీగతీ లేదు.

అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో పాటు చట్టసవరణ మేరకు మున్సిపల్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ 2019లో హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో 4 వారాల్లో నియామకం చేపట్టాలని గత ఏడాది ఏప్రిల్‌ 27న న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2017లో ముగ్గురు విశ్రాంత జిల్లా జడ్జిలు, డైరెక్టర్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌లో పనిచేసిన విశ్రాంత డైరెక్టర్ల ఇద్దరి పేర్లను సైతం ఆ తీర్పులో పేర్కొంది. విశ్రాంత జిల్లా జడ్జిల జాబితాలో పి.రాఘవేందర్‌, కె.దేవీప్రసాద్‌, పాటిల్‌ విఠల్‌రావు, డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుంచి వి.నరేందర్‌రావు, కె.ఆనంద్‌బాబు పేర్లను పంపినట్లు న్యాయస్థానం వివరించింది. ఆ తీర్పు వెలువడి 10 నెలలు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరోపక్క భవన నిర్మాణాల్లో యథేచ్ఛగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ట్రైబ్యునల్‌ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని