పాత్రికేయులు అన్ని వర్గాల గొంతు వినిపించాలి

రాజకీయాలకు అతీతంగా పాత్రికేయులు అన్ని వర్గాల గొంతుకలను వినిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 29 Mar 2023 05:15 IST

టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: రాజకీయాలకు అతీతంగా పాత్రికేయులు అన్ని వర్గాల గొంతుకలను వినిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే)-2023 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, వైకాపా రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు హాజరై డైరీని ఆవిష్కరించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపాలని సూచించారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలని కోరారు. కేశవరావు మాట్లాడుతూ సత్యాన్ని శోధించాల్సిన గురుతర బాధ్యత విలేకరులదేనన్నారు. ఏ విషయమైనా నిర్ధారణ చేసుకున్న తర్వాతే వార్త రూపంలోకి తేవాలని సూచించారు. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో పొరపాట్లు జరుగుతుంటాయని, సాధ్యమైనంత వరకు అవి దొర్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో విలేకరుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే దిల్లీ యూనిట్‌ అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి వంగా తిరుపతి, కోశాధికారి కొండపల్లి శిరీష్‌ రెడ్డి, సభ్యులు ఎ.కృష్ణారావు, ఎం.రవీందర్‌రెడ్డి, ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, యు.అశోక్‌రెడ్డి, కొన్నోజు రాజు, మేకా గోపీకృష్ణ, జబ్బర్‌లాల్‌ నాయక్‌, నాగరాజ్‌, ప్రభు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని