ప్రశ్నపత్రాల లీకేజీపై రంగంలోకి ఈడీ!
సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో వెల్లడి కావడంతో త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగబోతోంది.
నేడు కేసు నమోదు!
నిందితులను విచారించే అవకాశం
ఆర్థిక లావాదేవీలపై నజర్
డేటా చౌర్యంపైనా ఈసీఐఆర్ నమోదు
ఈనాడు, హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో వెల్లడి కావడంతో త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తొలుత బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కొందరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులనూ విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టబోతోంది. సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేసిన డేటా లీకేజీపైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది.
సిట్ దర్యాప్తులో పలు ఆధారాలు లభ్యం..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలు వాటిని లీక్ చేసి అమ్ముకున్నారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ చేపట్టిన దర్యాప్తులో పలు ఆధారాలు లభించాయి. టీఎస్‌పీఎస్సీ మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. వీటన్నింటికి సంబంధించిన లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్.. తన స్నేహితురాలు రేణుకకు ఏఈ ప్రశ్నపత్రం ఇచ్చి ప్రతిఫలంగా రూ.10 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌లు దీన్ని మరో అయిదుగురికి అమ్ముకొని దాదాపు రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకొందరికీ ప్రశ్నపత్రం అమ్ముకొని ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రానికి సంబంధించిన లావాదేవీల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ రంగంలోకి దిగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోనుడడం గమనార్హం.
డేటా చౌర్యం కేసులోనూ..
దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ ఈడీ ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం ఉండటంతో.. ఆ శాఖ దర్యాప్తు జరుపుతోంది. డేటా విక్రయంలో పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడి కాలేదు. కానీ, కోట్ల మందికి సంబంధించిన డేటా చేతుల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వ్యాపారం కూడా భారీగానే జరిగి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. అన్నింటికీ మించి డేటా చౌర్యం వెనక గాని, కొనుగోలు చేసినవారి వెనక గాని ఏదైనా ఉగ్రకోణం ఉందా? అనేది దర్యాప్తు సంస్థలను వేధిస్తున్న ప్రశ్న.
అనుమానాస్పద లావాదేవీలపై కన్ను
అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గాని, దాని ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు గాని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై కేసు నమోదు చేయబోతోంది. కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ నుంచి గానీ, న్యాయస్థానం నుంచి గానీ ఎఫ్‌ఐఆర్ పొంది.. శుక్రవారం ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన నిందితులను ఈడీ అధికారులు మరోమారు విచారించడానికి, అవసరమైతే అరెస్టు చేయడానికీ అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయం ఉందని గాని, దీనికి సంబంధించిన సమాచారం గాని తెలుసని భావిస్తే వారికి నోటీసులు జారీ చేసి విచారించడానికీ వీలుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం
-
Movies News
Pareshan movie review: రివ్యూ: పరేషాన్.. రానా సమర్పణలో వచ్చిన చిత్రం మెప్పించిందా?
-
Politics News
Chandrababu: తెదేపా అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది: చంద్రబాబు
-
India News
Mysterious sounds: భూమి నుంచి చెవిపగిలిపోయే శబ్దాలు.. వణికిపోతున్న ప్రజలు