Tomato price: టమాటా.. వందకు పైమాటే!

టమాటా ధర ఈ నెల ప్రారంభంలో కిలో రూ.15 ఉండేది. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఏకంగా రూ.100 దాటేసింది. కొన్నిచోట్ల రూ.120కి కూడా విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కూడా రూ.100-120కి చేరింది.

Updated : 28 Jun 2023 07:47 IST

పచ్చిమిర్చి మహా ఘాటు!
మండుతున్న కూరగాయల ధరలు
అకాలవర్షాలతో తగ్గిన ‘యాసంగి’ ఉత్పత్తులు
ఎండలతో మందగించిన దిగుమతులు

ఈనాడు, హైదరాబాద్‌: టమాటా ధర ఈ నెల ప్రారంభంలో కిలో రూ.15 ఉండేది. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఏకంగా రూ.100 దాటేసింది. కొన్నిచోట్ల రూ.120కి కూడా విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కూడా రూ.100-120కి చేరింది. హనుమకొండలో ఏకంగా రూ.200కి కూడా విక్రయిస్తున్నారు. ఇవేకాదు.. ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయలు, ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. గ్రామాల నుంచి నగరాల దాకా అన్నిచోట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమాటా, పచ్చిమిర్చితో పాటు చిక్కుడు వంటివాటి ధరలు కిలో రూ.100-150 మధ్య పలుకుతూ చుక్కలు చూపిస్తున్నాయి. బీర, బజ్జీమిర్చి, చిక్కుడు, క్యాప్సికం ధర రూ.80; గోకర, క్యారెట్‌, వంకాయ, బెండ, కాకర రూ.60.. ఇలా సామాన్యుల కొనుగోలుశక్తికి మించి ధరలు పెరుగుతున్నాయి. బీన్స్‌ ధర మునుపెన్నడూ లేనివిధంగా కిలో రూ.120కి చేరింది. ఉల్లి రూ.20కి తగ్గడం లేదు. నిమ్మకాయ డజను రూ.60 అయింది. కరోనా తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. రైతుబజార్లలోనూ ధరలు దడ పుట్టిస్తుండగా.. బహిరంగ మార్కెట్లలో వ్యాపారులు అంతకంటే భారీగా పెంచి విక్రయిస్తున్నారు. ప్రధాన కూరగాయలన్నీ కిలో రూ.40కి పైమాటే. ఆకుకూరలూ అదేరీతిలో మండుతున్నాయి. కరివేపాకు, పుదీనా కట్టల గురించి చెప్పనక్కర్లేదు. మెంతి, పుంటి, చుక్క, తోట, పాలకూరలు ఇదివరకు రూ.10కి నాలుగేసి కట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు 2 మాత్రమే ఇస్తున్నారు. రైతుబజార్లలోనూ పట్టికలపై ఒక ధర, విక్రయించేది మరో ధరగా ఉంది. అక్కడ రైతుల పేరిట వ్యాపారులు, దళారులు దందా నడుపుతున్నారన్న విమర్శలున్నాయి.

  • నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మంలలో రూ.100కి కిలో చిన్న టమాటాలు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ మార్కెట్లలో రూ.110కి చేరింది. హనుమకొండ తదితర ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఏకంగా రూ.120కి విక్రయిస్తున్నారు. తెలంగాణలో మిగిలిన కూరగాయలతో పోలిస్తే టమాటా వాడకం ఎక్కువ.
  • యాసంగిలో కూరగాయల సాగు రాష్ట్రంలో విస్తరించింది. దిగుబడులు బాగుంటాయని రైతులు సంతోషంగా ఉన్న తరుణంలో మార్చి 16 నుంచి మొదలైన అకాల వర్షాలు వారి ఆశలకు గండికొట్టాయి. 2.15 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టగా 72 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా పండే రంగారెడ్డి, వికారాబాద్‌, సిద్దిపేట, కరీంనగర్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లింది. మార్కెట్లకు రావాల్సిన కూరగాయలు తగ్గిపోయాయి.
  • తెలంగాణకు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి నిత్యం కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. కొద్దిరోజుల క్రితం వరకూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చే వాహనాలు తగ్గిపోయాయి. డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య అంతరం పెరిగిపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. దీంతో కొనుగోలుకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. కిలోకి బదులు అరకిలో, పావుకిలోతోనే సర్దుబాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు. వానాకాలం సీజన్‌లో ఆరంభంలోనే రైతులు కూరగాయలను సాగు చేస్తుంటారు. ఈ ఏడాది వర్షాల రాక ఆలస్యం అయింది. ఈమేరకు వర్షాలు కురిసి.. సాగు చేపట్టి.. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతే ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

దేశమంతటా పైపైకి..

దిల్లీ: దేశవ్యాప్తంగానూ పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ.100కి చేరింది. దిల్లీలో రూ.80కి విక్రయిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో హోల్‌సేల్‌ ధర కిలోకి రూ.80-90 వరకూ పలుకుతుండగా.. రిటైల్‌లో రూ.100 దాటింది. కాన్పుర్‌కు టమాటాలు ఎక్కువగా బెంగళూరు నుంచి వస్తాయని, రానున్న రోజుల్లో ఇవి కిలో రూ.150కి చేరుకోవచ్చని స్థానిక కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ముంబయి, బెంగళూరుల్లోనూ రిటైల్‌ ధర రూ.100కు చేరుకుంది. టమాటాను అధికంగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటం, సరఫరాలో అంతరాయమే ధరల పెరుగుదలకు కారణాలుగా వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. టమాటా సాగు మధ్యప్రదేశ్‌, ఏపీ, కర్ణాటకతోపాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌లలో అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపించింది. మొన్నటివరకూ వడగాలులతో ఈ ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినప్పటికీ.. పలుప్రాంతాల్లో భారీ వర్షాలవల్ల పంట దెబ్బ తింటోంది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్‌, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్‌, కోలార్‌, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. ప్రధాని విధానాలవల్ల టమాటా ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్‌ విమర్శించింది.

త్వరలో తగ్గుతాయి: కేంద్రం

టమాటా ధరల పెరుగుదల తాత్కాలిక సీజనల్‌ ధోరణి అని, త్వరలో ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘టమాటా త్వరగా చెడిపోయే పంట. ఆకస్మిక వర్షాలతో రవాణాకు ఇబ్బంది తలెత్తింది. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. ప్రతి ఏడాదీ ఈ సమయంలో ధరలు ఇలాగే పెరుగుతాయి’ అని వినియోగ వ్యవహారాలశాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ వెల్లడించారు.


ఒక మిరపకాయ రూ.3

ఒక టమాటా రూ.5

నేను కిలో పచ్చిమిర్చి రూ.200కి కొన్నాను. కిలోకి 70 కాయలు వచ్చాయి. అంటే దాదాపు 3 రూపాయలకు ఒక మిరపకాయ చొప్పున కొనుగోలు చేశాను. టమాటా రూ.110 ఉంది. కిలోకి 20 కాయలు మాత్రమే వచ్చాయి. అంటే ఒక్కో కాయ ధర రూ.5 కంటే ఎక్కువే. నా జీవితంలో ఇంత ధర పెట్టలేదు.

అమీరుద్దీన్‌, హనుమకొండ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని