NEET Counselling 2023: పాత విధానంలోనే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) స్పష్టతను ఇచ్చింది.

Updated : 18 Jul 2023 08:25 IST

ఆలిండియా కోటా మొదటి రౌండ్‌ తర్వాతే ఇక్కడ కౌన్సెలింగ్‌
రికార్డు స్థాయిలో 23 వేలమంది రిజిస్ట్రేషన్‌
బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజు పెంచేందుకు ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) స్పష్టతను ఇచ్చింది. 2023-24 విద్యాసంవత్సరానికి నీట్‌-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలు మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నాయి. ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాల కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఎంసీసీనే కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రతిపాదించగా తెలంగాణ, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఏకకాలంలో పూర్తిచేసే నేపథ్యంలోనే ఆలిండియా కోటా సీట్లకు ఎంసీసీ, కన్వీనర్‌ కోటా సీట్లకు రాష్ట్రాలు ఏకకాలంలో కౌన్సెలింగ్‌ నిర్వహించేలా ఎన్‌ఎంసీ ప్రతిపాదించగా రాష్ట్రాలు దీనికి అంగీకరించాయి. తాజాగా ఈ ప్రతిపాదనను ఎంసీసీ విరమించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆలిండియా కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ (నర్సింగ్‌) సీట్ల భర్తీకి షెడ్యూలును విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంసీసీ మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 6వ తేదీ నాటికి పూర్తికానుంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను నిర్ణయించనున్నారు.

వెల్లువెత్తిన దరఖాస్తులు: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో చేరేందుకు రికార్డు స్థాయిలో నీట్‌-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 44,629 మందిలో 23వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాల పరిశీలనను కాళోజీ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 3790 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా వీటిలో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు మినహాయిస్తే మిగిలిన 3221 ఎంబీబీఎస్‌ సీట్లకు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50 శాతం కన్వీనర్‌ కోటా కింద మరో 2325 సీట్లకు కలిపి మొత్తం 5546 సీట్లకు కాళోజీ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.


ఫీజులను ఖరారు చేయనున్న వైద్య, ఆరోగ్య శాఖ

2023-24 నుంచి 2025-26 విద్యాసంవత్సరం వరకు ఫీజులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఎంబీబీఎస్‌, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు సహా వివిధ కోర్సులకు ఫీజుల పెంపునకు ప్రైవేటు కళాశాలల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. కళాశాలల ప్రతిపాదనలను పరిశీలించి టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. వీటిపై రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కాళోజీ ఆరోగ్యవిశ్వవిద్యాలయం మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌కు ప్రకటన జారీ చేసేలోపు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ప్రైవేటు కాలేజీల ఫీజుల పెంపు ప్రతిపాదనలపై అధ్యయనం చేసిన టీఎఎఫ్‌ఆర్‌సీ కన్వీనర్‌ కోటా ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ.60 వేలు ఉండగా ఇది యథాతథంగా ఉంచాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజు మాత్రం 2 శాతం నుంచి 3 శాతం దాకా పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రకారం ‘బి’ కేటగిరి సీట్ల ఫీజు రూ.20 వేల నుంచి రూ.30 వేల పెంపునకు... ‘సి’ కేటగిరి సీట్ల ఫీజు రూ.30 వేలనుంచి రూ.40 వేల మేరకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ తుది నిర్ణయం తీసుకుని జీవోను ఇవ్వాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని