Cyber Attack: ఎఫ్‌ఐఆర్‌ కాకున్నా సొమ్ము అప్పగింత..!

సైబర్‌ మోసాలకు గురై డబ్బు పోగొట్టుకొని మదనపడుతున్న వారికి ఊరట కలిగిస్తూ.. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ), సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) కలిసి ప్రామాణిక విధానం(ఎస్‌ఓపీ) రూపొందించాయి.

Updated : 06 Mar 2024 05:58 IST

సైబర్‌ నేరాల బాధితులకు  ఊరట దిశగా కసరత్తు
9న మెగా లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారం..!

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ మోసాలకు గురై డబ్బు పోగొట్టుకొని మదనపడుతున్న వారికి ఊరట కలిగిస్తూ.. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ), సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) కలిసి ప్రామాణిక విధానం(ఎస్‌ఓపీ) రూపొందించాయి. సైబర్‌ కేసుల దర్యాప్తులో భాగంగా నేరస్థులు లేదా అనుమానితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్మును బాధితులకు తిరిగి ఇప్పించేందుకు సీఆర్పీసీ 457 సెక్షన్‌ కింద న్యాయస్థానంలో దరఖాస్తు చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ నెల 9న జరిగే మెగా లోక్‌అదాలత్‌లో ఆయా కేసులను పరిష్కరించే దిశగా పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.

రూ.25 వేలలోపు తిరిగిచ్చేందుకు

చాలావరకు సైబర్‌ నేరాల్లో సొమ్ము పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసినా బినామీ ఖాతాల్లోకి సొమ్ము చేరడంతో నిందితులెవరనేది గుర్తించలేకపోతున్నారు. అలాంటి ఉదంతాల్లో సాధారణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం లేదు. అయితే బాధితుల సొమ్మును సదరు ఖాతాల నుంచి ఉపసంహరించకుండా జప్తు చేయగలుగుతున్నారు. అలా రూ.25 వేలలోపు పోగొట్టుకున్న బాధితులకు ఆ సొమ్మును తిరిగి ఇప్పించేందుకు కసరత్తు చేపట్టారు. ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా 18 వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు. వాటికి సంబంధించిన సొమ్ము రూ.16 కోట్ల నుంచి 18 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసుల దర్యాప్తు అధికారులంతా సంబంధిత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా యూనిట్ల ఉన్నతాధికారులకు టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయెల్‌ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని