యాగ్జిలరీ పదోన్నతులపై ఆరా

పోలీసు శాఖలో ప్రణీత్‌రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Published : 27 Mar 2024 04:02 IST

ప్రణీత్‌రావు ఉదంతం నేపథ్యంలో అధికారుల దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు శాఖలో ప్రణీత్‌రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ప్రణీత్‌రావు పేరు వెలుగులోకి రాగా.. అదే సమయంలో ఆయన యాగ్జిలరీ పదోన్నతి అంశం కూడా బయటకు పొక్కింది. ఆయనతోపాటు మరికొందరికీ ఇలానే పదోన్నతులు ఇచ్చిన విషయం వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా పదోన్నతుల వ్యవహారంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పనితీరు పేరుతో సీనియార్టీతో సంబంధం లేకుండా కొందరికి వెంటవెంటనే పదోన్నతులు ఇవ్వడంపై ఉమ్మడి ఏపీలోనే అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇలాంటి ప్రమోషన్లపై న్యాయస్థానం కూడా అభ్యంతరం వ్యక్తంచేసింది. తాజాగా ప్రణీత్‌రావు ఉదంతం నేపథ్యంలో యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారందరి వివరాలు వెలికి తీస్తున్నారు.

వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న రోజుల్లో దానికి అడ్డుకట్ట వేసేందుకు సిబ్బందిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉమ్మడి ఏపీ పోలీసు శాఖ యాగ్జిలరీ పదోన్నతులకు శ్రీకారం చుట్టింది. క్రమంగా మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిపోవడంతో ఈ పదోన్నతుల అంశమూ తెరమరుగైంది. అయితే, ప్రభుత్వ అండదండలు ఉన్న వారికి మాత్రం అడపాదడపా ఈ తరహా పదోన్నతులు వస్తూనే ఉన్నాయి. ప్రణీత్‌రావు ఉదంతమే ఇందుకు నిదర్శనం. మావోయిస్టులపై నిఘా పెట్టే పేరుతో సమకూర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులకు చెందిన ఫోన్లు ఎడాపెడా ట్యాప్‌ చేశారన్నది ఆయనపై ఉన్న అభియోగం. ఈ పనిచేసినందుకే ఆయనకు యాగ్జిలరీ పదోన్నతి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలానే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అద్భుతంగా పనిచేశారని రికార్డుల్లో చూపుతూ ఓ అదనపు ఎస్పీ స్థాయి అధికారికి నాన్‌క్యాడర్‌ ఎస్పీగా పదోన్నతి ఇచ్చారన్నది మరో ఆరోపణ. ఈ అధికారికి కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండేవని.. ఆ కారణంతోనే పదోన్నతి ఇచ్చారు తప్ప ఆయన పనితీరుతో కాదనే అభిప్రాయం పోలీసు శాఖలో వ్యక్తమవుతోంది. ప్రణీత్‌రావు ఉదంతం నేపథ్యంలో యాగ్జిలరీ పదోన్నతులు అక్రమమంటూ ఇప్పటికే అనేక మంది పోలీసులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. గత పదేళ్లలో ఎవరెవరు యాగ్జిలరీ పదోన్నతులు తీసుకున్నారు.. ఇందుకు వారికి ఉన్న అర్హత ఏమిటన్న వివరాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.


నిందితుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిందితులను ఐదురోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. కస్టడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయడానికి నిందితుల తరఫు న్యాయవాదులు సమయం కోరగా.. కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని