నేతన్నలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

చేనేత కార్మికులకు గత భారాస ప్రభుత్వ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందని, నాటి కేసీఆర్‌ ప్రభుత్వం వారిపై కక్ష గట్టి రోడ్డున పడేసిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

Published : 06 Apr 2024 05:27 IST

 శాశ్వత ప్రయోజనాలు కల్పించేందుకు కృషి
భారాస హయాంలో వారికి అన్యాయం జరిగింది
రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: చేనేత కార్మికులకు గత భారాస ప్రభుత్వ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందని, నాటి కేసీఆర్‌ ప్రభుత్వం వారిపై కక్ష గట్టి రోడ్డున పడేసిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతన్నలకు చేతినిండా ఆర్డర్లు ఇస్తూ బకాయిలను చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తోందని అన్నారు. శుక్రవారం తుమ్మల తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘చేనేత కార్మికుల సమస్యలపై లేఖ పేరిట మాజీ మంత్రి కేటీఆర్‌ రాజకీయం చేస్తున్నారు. గత ప్రభుత్వం పరస్పర వినిమయ సహకార సంఘాల (మాక్స్‌)ను ప్రోత్సహించడం వల్ల చేనేత కార్మికులకు లబ్ధి చేకూరలేదు. 393 చేనేత సంఘాల్లో 105 సంఘాలకే పని కల్పించారు. 2023 నవంబర్‌ వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు రూ.488.38 కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయి. బతుకమ్మ చీరల పథకం కింద టెస్కోకు చెల్లించాల్సిన రూ.351.52 కోట్లను కూడా విడుదల చేయలేదు. చేనేత మిత్ర పథకాన్ని మంత్రిమండలి ఆమోదం లేకుండా తెచ్చి నిధులను విడుదల చేయలేదు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత  రూ.53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేశాము. సమగ్ర శిక్ష అభియాన్‌ పథకం కింద యూనిఫాంకు అవసరమైన నూలు, సైజింగ్‌ కోసం 50 శాతం అడ్వాన్సు కింద రూ.47 కోట్లను విడుదల చేశాం. చేనేత సహకార సంఘాలకు బకాయిలు రూ.8.81 కోట్లు విడుదల చేశాం. త్వరలోనే మరో రూ.7 కోట్లు ఇవ్వనున్నాం. నేతన్న భరోసా అనే ప్రభుత్వ పథకాన్ని తేనున్నాం. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల విడుదలకు యత్నిస్తున్నాం. రాష్ట్రంలో ఐఐహెచ్‌టీ,   చేనేత పార్కులు, సమూహాల పునరుద్ధరణ, సూక్ష్మ సమూహాల ప్రారంభం, ఎన్‌ఐడీ, కొత్త జౌళి విధానం రూపకల్పనకు కృషి చేస్తున్నాం. మొత్తం 140 మ్యాక్స్‌, 135 చిన్న తరహా యూనిట్లు చేనేత రంగంలో ఉన్నాయి. వీటి విద్యుత్‌ వినియోగం ఆధారంగా 30 శాతం బోగస్‌ సొసైటీలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి, వాటి రద్దుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికైనా భారాస నేతలు ఆత్మవిమర్శ చేసుకొని నేతన్నల శాశ్వత అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తే పరిశీలించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని