వికసిత్‌ భారత్‌ను వర్సిటీలు సాకారం చేయాలి

ఉన్నత విద్యారంగంలో సవాళ్లను అధిగమించేందుకు భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వికసిత్‌ భారత్‌ను సాకారం చేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ సూచించారు.

Published : 16 Apr 2024 03:27 IST

ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

ఈనాడు, హైదరాబాద్‌- శామీర్‌పేట్‌, న్యూస్‌టుడే: ఉన్నత విద్యారంగంలో సవాళ్లను అధిగమించేందుకు భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వికసిత్‌ భారత్‌ను సాకారం చేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ సూచించారు. భారతీయ వర్సిటీల సంఘం (ఏఐయూ) 98వ వార్షిక సదస్సు ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘ఉన్నత విద్యలో సాధించిన ప్రగతి- భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధి’పై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సులో రాధాకృష్ణన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యారంగం అన్నివిధాలా అభివృద్ధి సాధించేలా ఉపకులపతులు కృషి చేయాలని సూచించారు. విద్యారంగంలో వస్తున్న పెనుమార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలోని యువత ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత వర్సిటీలదేనని సూచించారు. స్వామి వివేకానంద, అబ్దుల్‌కలాం సూచించిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి చేరిందని, రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ టీజీ సీతారాం, ఏఐయూ అధ్యక్షుడు జి.డి.శర్మ, ఉపాధ్యక్షుడు వినయ్‌కుమార్‌ పాఠక్‌, కార్యదర్శి  పంకజ్‌ మిత్తల్‌, ఇక్ఫాయ్‌ వర్సిటీ ఉపకులపతి ఎల్‌.ఎస్‌.గణేశ్‌, విశ్రాంత ఉపకులపతి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘యునైటెడ్‌ నేషన్స్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని