ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాల్సిందే

మార్కెట్‌ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

Published : 16 Apr 2024 05:49 IST

 మార్కెటింగ్‌ శాఖకు మంత్రి తుమ్మల ఆదేశం
పంట నష్టం సర్వే పూర్తి.. ఈసీ అనుమతిస్తే పరిహారం
రుణాల వసూళ్లకు రైతులను వేధించొద్దని బ్యాంకులకు వినతి

ఈనాడు, హైదరాబాద్‌: మార్కెట్‌ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. మామిడి పండ్ల పక్వానికి కార్బైడ్‌ ఉపయోగించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. నాణ్యతా ప్రమాణాల ప్రకారం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పొద్దుతిరుగుడు, శనగ, కంది, మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత నెలలో కురిసిన వడగళ్ల వానల వల్ల జరిగిన పంటనష్టానికి సంబంధించి సర్వే పూర్తయిందని.. ఎన్నికల సంఘం అనుమతి రాగానే ప్రభుత్వం పంట నష్టపరిహారం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.

పంటల బీమా అమలుకు సన్నాహాలు

సీఎం ఆదేశానుసారం ఏ ఒక్కరైతు ప్రకృతి విపత్తులతో పంట నష్టపోకూడదని పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీని కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో వచ్చే వానాకాలం సీజన్‌లోనే బీమా పథకం అమలుకు టెండర్ల ప్రక్రియ చేపడతామని చెప్పారు. త్వరలో రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని, అప్పటి వరకు బ్యాంకులు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు పంటరుణాల వసూళ్ల పేరిట రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. రైతుభరోసా పథకం విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. వానాకాలం సీజన్‌కు అన్ని రకాల పంటలకు అవసరమయ్యే విత్తన సరఫరా చేయాలని, మార్క్‌ఫెడ్‌ ద్వారా దాదాపు 5 లక్షల టన్నులను జూన్‌ నెలారంభానికి నిల్వ చేయాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే నాలుగున్నర లక్షల టన్నుల యూరియా నిల్వ చేయించామని తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాల టెండర్ల ప్రక్రియకు ఎన్నికల సంఘం అనుమతులు కోరామని.. రాగానే రైతులకు రాయితీపై అందుబాటులోకి తెస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని