సంక్షిప్త వార్తలు (4)

కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్‌ సెక్రటరీ డీఎం రాయిపురే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం పంపారు.

Updated : 16 Apr 2024 06:29 IST

22న కృష్ణా బోర్డు సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్‌ సెక్రటరీ డీఎం రాయిపురే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం పంపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోర్డుకు సంబంధించిన బడ్జెట్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌, తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొననున్నారు.


కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలి

సీఎం రేవంత్‌కు ఆర్‌.కృష్ణయ్య లేఖ

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే ముందు కులగణన చేపట్టి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడంతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ప్రకటించిందని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం కులగణన చేపట్టి జనాభా ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 50 శాతం పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని నెరవేర్చిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని కోరారు.


‘ఆటా’ మహాసభలకు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా) ద్వైవార్షిక మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఆటా కన్వీనర్‌ పాశం కిరణ్‌రెడ్డి సోమవారం మంత్రిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ఆహ్వాన లేఖ అందించారు. కాగా జూన్‌ 7 నుంచి 9 వరకు అమెరికా అట్లాంటాలోని ‘జార్జియా వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌’లో ‘ఆటా’ కన్వెన్షన్‌, యూత్‌ కాన్ఫరెన్స్‌ జరగనున్నాయి.


ఏపీలో పట్టుబడిన సొత్తు రూ.125.96 కోట్లు

ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడి

ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.125.96 కోట్లు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు. ఇందులో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన మద్యం, రూ.4.06 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్‌ మెటల్స్‌, రూ.12.89 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని