ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి

ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated : 20 Apr 2024 05:25 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయసు 6 ఏళ్లు ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు చెందిన పి.పరీక్షిత్‌రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2020 జాతీయ విద్యా పాలసీకి అనుగుణంగా పాఠశాల విద్య, అక్షరాస్యత కేంద్ర మంత్రిత్వశాఖ గత ఏడాది ఫిబ్రవరి 9న అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ మొదటి తరగతికి కనీస వయసు 6 ఏళ్లుగా నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీన్ని సడలించడం ద్వారా ప్రీప్రైమరీ తరగతుల్లో ప్రవేశానికీ పరిమితిని సడలించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేగాకుండా విద్యార్థులకు సెల్‌ఫోన్‌ అనేది వ్యసనంగా మారుతోందని.. దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్నారు. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం కేంద్రంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని