ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!

మహబూబ్‌నగర్‌ జిల్లా గోప్లాపూర్‌కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు

Updated : 01 May 2024 06:18 IST

 వ్యాపారుల సిండికేట్‌లో రైతులకు నష్టాలు
వర్షాభావం, తెగుళ్ల బెడద, మార్కెటింగ్‌ లోపంతోనూ ఏటికేడు తగ్గుతున్న సాగు విస్తీర్ణం

మహబూబ్‌నగర్‌ జిల్లా గోప్లాపూర్‌కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: ఉల్లి ప్రతి ఇంట్లో నిత్యావసర సరకు. మార్కెట్‌లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. వీటిని పండించే రైతులకు మాత్రం గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. వర్షాభావానికి తోడు చీడపీడల బెడద, మార్కెటింగ్‌ లోపం తదితర సమస్యలతో రైతులు ఉల్లి సాగుపై నిరాసక్తత చూపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలమే అయినా ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకపోవడంపాటు ఇతర ప్రతికూల పరిస్థితులతో సాగు విస్తీర్ణం తగ్గుతోంది. అయిదేళ్ల క్రితం అన్ని జిల్లాల్లో కలిపి 32,034 ఎకరాల్లో సాగైంది. నిరుడు యాసంగి సీజన్‌లో 20,290 ఎకరాలకు.. ఈసారి 6204 ఎకరాలకు తగ్గింది. ప్రస్తుతం వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకే పరిమితమైంది.

ప్రోత్సాహం కరవై...

ఉల్లికి అయిదేళ్లుగా మంచి డిమాండు ఉంటోంది. మార్కెట్‌ అవసరాలకు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో సాగును పెంచి లాభాలు పొందే అవకాశం ఉన్నా రైతులు ముందుకు రావడం లేదు. పెట్టుబడి ఏటేటా పెరుగుతోంది. విత్తనాలు, ఎరువులు, కూలీ ధరలు రెట్టింపయ్యాయి. మరోవైపు చీడపీడల బెడద వెంటాడుతోంది. ఈ ఏడాది తామర, ఆకుమచ్చతోపాటు కుళ్లు తెగులు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు వర్షాలు లేక ఉల్లి నాణ్యతపై ప్రభావం చూపించింది. ఎకరా దిగుబడి సగటు 50 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 30 నుంచి 35 క్వింటాళ్లు దాటడం లేదు. 

అమ్మడానికీ కష్టాలే

అన్ని కష్టాలకోర్చి పండించినా.. పంట నిల్వకు, విక్రయానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిల్వ సౌకర్యాలు లేక కోసిన వెంటనే విక్రయించాల్సి వస్తోంది. ఉల్లికి ప్రత్యేక మార్కెట్లు లేవు. కూరగాయల మార్కెట్లకు తీసుకెళ్లే విక్రయించాలి. అధిక మొత్తంలో పంటను తీసుకెళ్తే వ్యాపారులు దాన్నే ఆసరాగా చేసుకుని సిండికేటుగా మారి ధరను తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

గిట్టుబాటు ధర రావడం లేదు

మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.15కి పైగా ఉంది. పండించిన మాకు మాత్రం క్వింటాలుకు రూ.500 మించి రావడం లేదు. చేతికొచ్చిన పంటను కోసి మార్కెట్‌కు తరలించాలంటే కూలీలు, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గిట్టుబాటు ధర కూడా రావడం లేదు.

రాజు, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌

నష్టాల వల్లే పంట వేయలేదు

నాలుగేళ్లపాటు ఉల్లి వేశాను. నిరుడు 20 గుంటల్లో సాగు చేస్తే రూ.30 వేలు ఖర్చయింది. అతి కష్టం మీద పంట చేతికొచ్చింది. తీరా విక్రయిస్తే రూ.20 వేలు మాత్రమే వచ్చాయి. దీంతో ఈసారి పంట వేయలేదు.    

సంపత్‌, సిద్ధిపేట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని