ఎన్వోసీల పేరుతో..కాసులవేట!

భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

Published : 01 May 2024 04:42 IST

చేయి తడిపితే చాలు.. చెరువుల్లోనూ నిర్మాణాలకు అనుమతులు
ఏమీలేని చోట నిరభ్యంతర పత్రాల జారీకీ రూ.లక్షల్లో వసూళ్లు
నీటిపారుదల శాఖకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ఈనాడు- హైదరాబాద్‌: భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ నగర యూనిట్‌కు చెందిన డీఈఈ పవన్‌ కుమార్‌ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం అక్రమాల తీరును చాటుతోంది.

ఆ నిబంధనే వారికి వరం

భవన నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు పొందాలంటే ఆ ప్రాంతం చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్ల పరిధిలో లేదంటూ నీటిపారుదల శాఖ ధ్రువీకరించిన ఎన్వోసీని దరఖాస్తుతోపాటు సమర్పించాలనే నిబంధన ఉంది. చెరువులు, కుంటలు వంటి నీటి వనరులకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిబంధనను రూపొందించారు. ఇదే కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మారింది. కొన్నిచోట్ల చెరువులు, కాలువలు, నీటి వనరులేవీ లేకున్నప్పటికీ నీటిపారుదల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవడం కష్టంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో నిర్మాణాలు ఉన్నప్పటికీ లంచాలు తీసుకుని ఎన్వోసీలు జారీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖతోపాటు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో ప్రజావాణి కార్యక్రమంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఆక్రమణలను అడ్డుకునేది ఎవరు?

  • మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధి కీసర మండలంలో ఉన్న అన్నారాయణ్‌ చెరువు కబ్జాలకు గురవుతోందని, పరిశ్రమల నుంచి కలుషిత నీరు వదులుతున్నారని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 8 కాలనీలకు చెందిన వారు నిత్యం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. మూడు వైపుల నుంచి ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం అటువైపు వెళ్లడం లేదు.
  • కీసర మండలంలో నాత్కాన్‌చెరువు, పెద్ద చెరువుల బఫర్‌ జోన్లలో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ వ్యర్థాలను పడేస్తూ పెద్ద చెరువును డంపింగ్‌యార్డులా మారుస్తున్నారు. ఈ రెండు చెరువుల మధ్య ఉండే కాలువ కూడా ఆక్రమణలకు గురవుతోంది.
  • అమీన్‌పూర్‌ పెద్ద చెరువు అలుగుతో పాటు కాలువల ప్రాంతంలో బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెంచర్లకు అనుమతులు ఇస్తుండటంతో కొనుగోలు చేస్తున్న వారు నష్టపోతున్నారు. చెరువు పూర్తి స్థాయిలో నిండిన సమయంలో ప్లాట్లు మునిగిపోతున్నాయి. ఈ చెరువు తూము, అలుగును పూర్తిగా మూసివేయడంతో వెనుక జలాలు సమీప ప్రాంతాల కాలనీలను ముంచెత్తుతున్నాయి.
  •  నాగోలు ప్రాంతంలో ఉన్న చెరువుల బఫర్‌ జోన్ల సరిహద్దులను తిరిగి సర్వే చేసి.. హద్దులు నిర్ధారించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.
  •  గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో మూసకుంట (ముస్కి చెరువు) బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధులను పక్కాగా నిర్ధారించకపోవడంతో పలువురు మట్టి పోస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం అనుమతించిన లేఅవుట్‌కు భిన్నంగా కొందరు కుంటను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

ప్రాంతానికో రేటు కట్టి మరీ..

నీటిపారుదల శాఖలో హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో పలువురు ఇంజినీర్లు ఎన్వోసీలకు సంబంధించిన దస్త్రాలను పరిష్కరించడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఇద్దరు కీలక ఇంజినీర్ల మధ్య దస్త్రాల పరిశీలనకు సంబంధించి వివాదం ఏర్పడినట్లు చర్చ జరిగింది. దిగువ స్థాయి అధికారులు పరిశీలన పూర్తిచేయకపోయినా.. పైస్థాయిలోనే పరిశీలన పూర్తిచేసి ఎన్వోసీలు జారీ చేయడం ఈ వివాదానికి కారణమైనట్లు సమాచారం. పలువురు ఇంజినీర్లు ఎన్వోసీల జారీలో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలను బట్టి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు పలువురు నిర్మాణదారులు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల కాలంలో జారీ అయిన ఎన్వోసీలపై విచారణ చేయాలని వారు కోరుతుండగా..జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంటల బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌లను నిర్ధారించడంతోపాటు సరిహద్దులు గుర్తించి.. కంచె వేస్తే తప్ప కబ్జాలను నిలువరించడం కష్టమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని