సమాజ సేవకులను సత్కరించుకోవాలి

‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

Published : 01 May 2024 04:43 IST

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
శ్రీదేవి ప్రసాద్‌కు యుధ్‌వీర్‌ పురస్కార ప్రదానం

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన మంగళవారం హైదరాబాద్‌ కింగ్‌కోఠి భారతీయ విద్యాభవన్‌లో శంకర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్‌కు ప్రతిష్ఠాత్మకమైన 31వ యుధ్‌వీర్‌ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మహిళలను గౌరవించే సమాజం, దేశం సుభిక్షంగా ఉంటాయన్నారు. వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్న శ్రీదేవి ప్రసాద్‌ వంటి మహిళామూర్తులను గుర్తించి సత్కరించుకోవడమంటే ఎంతోమందికి స్ఫూర్తినివ్వడమేనన్నారు. పురస్కార గ్రహీత శ్రీదేవి ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్నవారి కోసం మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అలాంటి పిల్లలు 25 మందితో మొదలైన సంఖ్య ప్రస్తుతం 225కి చేరిందన్నారు. ఈ పురస్కారం తనతో కలిసి నడుస్తున్న ఫౌండేషన్‌ ప్రతినిధులు 99 మందికీ దక్కుతుందన్నారు. ‘‘ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గదుల్లో నిర్బంధిస్తారు. అలాంటి పిల్లలు ప్రస్తుతం ప్రయోజకులై మంచి జీతాలను అందుకుంటూ తల్లిదండ్రులకే ఆసరాగా నిలుస్తున్నారు’’ అని చెప్పారు. ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, విశ్రాంత ఐపీఎస్‌ అరుణాబహుగుణ స్వాగతం పలికారు. కార్యదర్శి విప్మా వీర్‌ పురస్కార పత్రాన్ని సమర్పించారు. ట్రస్టీ అమీర్‌ అలీఖాన్‌ వందన సమర్పణ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని